చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రం బలి

IYR Krishna Rao comments about Chandrababu Politics - Sakshi

     ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు బతుకు జీవుడా అంటూ విజయవాడకు వచ్చేశారు.. ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో మాజీ సీఎస్‌ ఐవైఆర్‌

     కేసు నుంచి బయటపడటానికి రాష్ట్రాన్ని ఫణంగా పెట్టారు

     తన నిస్సహాయత బయటపడకుండా సొంత గడ్డపై పాలన అంటూ ప్రచారం

     ఆ కేసు తర్వాత విభజన సమస్యలపై నేను సీఎంకు పంపిన ఫైళ్లు తిరిగిరాలేదు

     రాజధాని గురించి భారీ ఎత్తున ప్రచారం చేసి బిల్డప్‌ ఇచ్చారు  

     ప్రతికూల పరిస్థితిని తన మీడియా సాయంతో అనుకూలంగా మార్చుకున్నారు  

సాక్షి, అమరావతి: ఓటుకు నోటు కేసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గొంతు జీరబోయిందని, ఆయన బలహీన పడి బతుకు జీవుడా అంటూ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలివచ్చారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దెబ్బతీశారని విభజన అనంతరం రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అవలంభించిన విధానాలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలిని ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరిట తాను రచించిన పుస్తకంలో ఐవైఆర్‌ కృష్ణారావు వివరించారు. ఆదివారం విడుదల చేసిన ఈ పుస్తకంలో ఆయన ఇంకా ప్రస్తావించారంటే... 

‘‘హైదరాబాద్‌లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కాపాడుతానని తొలుత చెప్పిన చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్‌ సర్కారును దెబ్బతీసేందుకు తెరవెనుక పన్నాగాలు పన్ని దొరికిపోయారు. ఓటుకు నోటు వ్యవహారం బయటపడడంతో బతుకు జీవుడా అంటూ విజయవాడకు తరలివచ్చారు. తరువాత హైదరాబాద్‌కు వెళ్లడం తగ్గించేశారు. విజయవాడలో రాజధాని గురించి భారీ ఎత్తున ప్రచారం చేసి, ఒక ఊపు సృష్టించి దానిపై బిల్డప్‌ ఇవ్వడం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లో ఉండలేని తన నిస్సహాయత బయటపడకుండా విజయవాడలోనే ఉండిపోవడానికి రాజధాని పేరుతో బలమైన కారణాలు సృష్టించుకోవడం ప్రారంభించారు. ఒక ప్రతికూల పరిస్థితిని తన మీడియా సహాయంతో అనుకూలంగా మలుచుకున్నారు. ఇలాంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సొంత గడ్డపై నుంచే పరిపాలన ఉత్తమం అనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా ఓటుకు నోటు కేసు మహత్యమేనని వేరే చెప్పనక్కరలేదు.

ఈ కేసు తరువాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడటంతో విభజన సమస్యలపై సీఎస్‌గా నేను ముఖ్యమంత్రికి పంపించిన ఫైళ్లు తిరిగి వచ్చేవి కావు. తెలంగాణ ప్రభుత్వంతో సంఘర్షణకు పూనుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని అప్పుడు నాకు తెలిసింది. ఒక వ్యక్తి సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం స్పష్టంగా కనిపించింది. ఓటుకు నోటు కేసుతో కేంద్ర ప్రభుత్వం దృష్టిలోనూ ఏపీ ప్రభుత్వం చులకనగా మారింది. ఓటుకు నోటు కేసు తరువాత ముఖ్యమంత్రి ఆగమేఘాలపై విజయవాడకు వెళ్లిపోవడంతో సచివాలయ ఉద్యోగులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఓటుకు నోటు కేసు వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబుకు సమస్య వచ్చినందు వల్లే సచివాలయ ఉద్యోగులందరికీ తీవ్ర సమస్య తెచ్చిపెట్టారు. అసలు ఏమాత్రం సన్నాహాలు చేయకుండానే సచివాలయాన్ని అమరావతికి తరలించారు. ఇది మరీ ఘోరం.  

తెలంగాణకు విద్యుత్‌ను ఏకపక్షంగా నిలిపేశారు 
చంద్రబాబు తొలుత హైదరాబాద్‌లోనే ఉండిపోవాలన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రత్యర్థి వైఖరిని అవలంభించారు. రెండు రాష్ట్రాలకు వర్తించే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను గౌరవించే బదులు వాటిని రద్దు చేసి అదనపు విద్యుత్‌ను తెలంగాణతో పంచుకోకూడదని నిర్ణయించారు. ఒప్పందాలను రద్దు చేసి, ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్‌ సరఫరా కాకుండా చూశారు. ఈ ఒక్క నిర్ణయమే రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువ అగాథాన్ని సృష్టించింది, సంబంధాలను దెబ్బతీసింది’’ అని ఐవైఆర్‌ కృష్ణారావు తన పుస్తకంలో వివరించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top