టీడీపీ నేత ‘బీద’ సంస్థలపై ఐటీ దాడులు

IT attacks on tdp leader Company - Sakshi

చెన్నైలోని ఆయన నివాసగృహం, ‘బీఎంఆర్‌’ కార్యాలయాల్లో  సోదాలు

ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టారనే అనుమానంతోనే

కావలి: అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు  బీద మస్తాన్‌రావు ఇల్లు, వ్యాపార సంస్థలపై ఆదాయ పన్నుల శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. చెన్నైలోని ఆయన నివాసగృహం, కార్పొరేట్‌ కార్యాలయం, నెల్లూరులోని కార్యాలయం, కావలి సమీపంలో విమానాశ్రయ భూముల వద్ద ఉన్న (దామవరం) రొయ్యల మేత ఫ్యాక్టరీ,  రొయ్యలు విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన బీద మస్తాన్‌రావు రొయ్య పిల్లల గుంతల వద్ద సాధారణ గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి రొయ్యల ఎగుమతిదారుడిగా ఎదిగారు. చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్‌తో పాటు నెల్లూరు జిల్లాలో విడవలూరు మండలం రామతీర్థం, అల్లూరు మండలం ఇస్కపల్లిలో ఉన్న రొయ్య పిల్లల ఉత్పత్తి ( హేచరీస్‌) కేంద్రాల ద్వారా ఏడాదికి 250 మిలియన్ల రొయ్య పిల్లలను విక్రయిస్తుంటారు. వీటి అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.1,500 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రొయ్య పిల్లలు అమ్మకాలు చేసే ప్రక్రియకు బిల్లులు ఉండవు.

అలాగే బీద మస్తాన్‌రావు ఇస్కపల్లిలో వందలాది ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తుంటారు. ఆక్వా రైతుల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలతో పాటు, తన సొంత చెరువుల ద్వారా సాగు చేసిన రొయ్యలను దామవరంలో ఉన్న ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నుంచి వివిధ దశల్లో శుభ్రపరచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అలాగే దామవరంలోని రొయ్యలు మేత ఫ్యాక్టరీ నుంచి వేల టన్నుల రొయ్యల మేత రాష్ట్రంలోని కోస్తా జిల్లాల మార్కెట్‌కు తరలిస్తారు.

రొయ్య పిల్లలు,  రొయ్యలు, రొయ్యల మేత దేశ, అంతర్జాతీయ మార్కెట్‌ ద్వారా ఏడాదికి రూ. 5,000 కోట్ల టర్నోవర్‌ ఉంటుందని భావిస్తున్నారు. బీద మస్తాన్‌రావుకు బినామీ పేర్లతో దేశ వ్యాప్తంగా ఉన్న గొలుసు మొబైల్‌ షాపుల్లో వాటా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో రియల్‌ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాలు, తమిళ   సినిమా నిర్మాణాలు తదితర వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ‘బీఎంఆర్‌’ గ్రూప్‌ పేరుతో బీద మస్తాన్‌రావు వ్యాపారాలు చేస్తుంటారు.

అజ్ఞాతంలోకి..
కాగా బీద మస్తాన్‌రావుతో పాటు ఆయన సోదరుడైన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర  ఐటీ దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసుకున్నారు. అలాగే బీద మస్తాన్‌రావు  వ్యాపార సంస్థల్లో కీలక విభాగాల ఇన్‌చార్జులు కూడా మొబైల్‌ ఫోన్లను  స్విచ్చాఫ్‌ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top