అంతా ఏకపచ్చమే! | Irrigation associations political in tdp | Sakshi
Sakshi News home page

అంతా ఏకపచ్చమే!

Sep 26 2015 1:51 AM | Updated on May 29 2018 4:23 PM

సాగునీటి సంఘాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. తమకు మేలు చేస్తారని భావించిన వారినే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే హక్కు రైతులకు ఉంటుంది

  సాగునీటి సంఘాల్లో దొడ్డిదారిన
 పీఠమెక్కిన తెలుగుతమ్ముళ్లు
 ‘వాయిదా’ స్థానాల్లో టీడీపీ
 ప్యానళ్లు ఎన్నికైనట్టు జీఓ
 టీడీపీకి అధికారుల‘జో హుకుం’
  న్యాయపోరాటానికి సిద్ధమంటున్న వైఎస్సార్ సీపీ

 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :
 ‘సాగునీటి సంఘాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. తమకు మేలు చేస్తారని భావించిన వారినే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే హక్కు రైతులకు ఉంటుంది..’ ఇదీ రైతు బాంధవుడైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం. ఆయన హయాంలో 2008లో తొలిసారిగా నిర్వహించిన ప్రాజెక్టు కమిటీ ఎన్నికల్లో అదే ఆశించారు. అలా తూర్పు గోదావరిలో గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవిని టీడీపీయే దక్కించుకుంది. ఇప్పుడు అందుకు భిన్నం. రాజకీయాలకతీతంగా సాగునీటి సంఘాలు        - మిగతా 2లోఠ
 
 
 
 ఎన్నికవాలంటూ 1997లో సాగునీటి సంఘాల చట్టాన్ని తెచ్చింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆ చట్టం స్ఫూర్తినే నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు సవరణలు తెచ్చిందీ ఆయన ప్రభుత్వమే. ‘ఏకాభిప్రా యం’ ముసుగులో సాగునీటి సంఘాల ఎన్నికల్ని పెద్ద ప్రహసనంలా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు బలంగా ఉన్న ప్రతి చోటా ఏకాభిప్రాయం కుదరలేదని అధికారులతో చెప్పించి.. ఇప్పుడు ఆ స్థానాల్లో తెలుగుతమ్ముళ్లను కూర్చోబెట్టారు. జిల్లాలో ఒకటి తప్ప మిగతా 168 మేజర్ ప్రాజెక్టుల సాగునీటి వినియోగదారుల సంఘాల కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రెండ్రోజుల క్రితం జీవో : 102 విడుదల చేయడం గమనార్హం.
 జీఓలో తారుమారు..
  వైఎస్సార్ సీపీ మద్దతుదారులు బలంగా ఉన్నచోట ఏకాభిప్రాయం కుదరలేదని వాయిదా వేసి, తాజాగా జారీ అయిన జీవోలో ఆయాచోట్ల ఏకాభిప్రాయంతో ఎన్నిక జరిగినట్లు ప్రకటించడం గమనార్హం. మండపేట నియోజకవర్గంలోని వల్లూరు, మండపేట, చెల్లూరు సాగునీటి సంఘాలకు టీడీపీ, వైఎస్సార్ సీపీ వేర్వేరుగా కమిటీలను ప్రతిపాదించాయి. అలా ప్రతిపాదించినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు రశీదు కూడా తీసుకున్నారు. కానీ ప్రభుత్వం అక్కడ ఏకాభిప్రాయం ఉన్నట్లు ప్రకటించింది. అంగర సంఘానికి ఏకగ్రీవం కాలేదని పేర్కొంటూ సాగునీటి పారుదలశాఖ ఎస్‌ఈ సుగుణాకరరావు శాసనసభా ప్రతిపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో తనను కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులకు ఒక నివేదిక ఇచ్చారు. కానీ జీవోలో అంతా తారుమారు చేశారు.

 వైఎస్సార్ సీపీ బలంగా ఉన్నా..
 రామచంద్రపురం నియోజకవర్గంలోని పల్లెపాలెంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. సర్వసభ్య సభానిర్వహణాధికారిగా వచ్చిన ఏఈ సుబ్రహ్మణ్యం ఆ విషయాన్ని గమనించి మినిట్స్ బుక్‌లో రైతుల సంతకాలు మాత్రమే తీసుకొని, మరేమీ నోట్ చేయకుండా వెళ్లిపోయూరు. తర్వాత కార్యాలయానికి వెళ్లి ఏకాభిప్రాయం వచ్చిందని కమిటీని ప్రకటించారు. అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు, బలభద్రపురం సంఘాలకు ఏకగ్రీవం కాలేదని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పుడు జీవోలో టీడీపీ వారితో కూడిన కమిటీలను ప్రకటించారు. కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లోని మొత్తం 14 సంఘాలకు టీడీపీ మద్దతుదారులతో పాటు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు తమ ప్యానల్ లను అధికారులకు సమర్పించారు. అయితే ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు కాబట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్న అధికారులు.. ఇప్పుడు ఏకపక్షంగా అధికార పార్టీ మద్దతుదారుల పేర్లతోనే సాగునీటి సంఘాల కార్యవర్గాన్ని ప్రకటించారు. వారిలో కొందరు గతంలో సాగునీటి సంఘాల్లో సభ్యులుగా ఉన్నప్పుడు పంటకాలువల తవ్వకాలు, మరమ్మతుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మరో విశేషమేమిటంటే ఆయా సంఘాల్లో మినిట్స్ బుక్ కాపీలను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి అధికారులు అందజేసినా ఇప్పుడు ఏకగ్రీవం అంటూ టీడీపీ మద్దతుదారుల ప్యానళ్లు బయటకు వచ్చాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో పి.గన్నవరం, మానేపల్లి, అయినవల్లి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టినా లాభం లేకపోయింది. టీడీపీ మద్దతుదారులే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కించుకున్నారు.
 
 మంత్రి అడ్డాలో అరుునవారికే అందలం..పిఠాపురం బ్రాంచి కెనాల్ కిందనున్న
 తుని నియోజకవర్గం తొండంగి మండలంలోని ఏవీ నగరం, కోదాడ సాగునీటి సంఘాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి బంధువులకే చోటు దక్కింది. ఏవీ నగరం సంఘానికి యనమల నాగేశ్వరరావును అధ్యక్షుడిగా, యనమల రామారావును ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వం ప్రకటించింది. కోదాడ సంఘానికి టీడీపీ, వైఎస్సార్ సీపీ వేర్వేరుగా ప్యానళ్లు ఇచ్చి నామినేషన్లు వేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనగా జ రిగిన పోలీసుల లాఠీచార్జిలో వైఎస్సార్‌సీ పీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కానీ అక్కడా ఏకగ్రీవం అని చెప్పి టీడీపీ ప్యానల్‌ను ప్రభుత్వం ప్రకటించింది.
 
 హైకోర్టును ఆశ్రరుుంచిన చిన్నారావు
 రాష్ట్ర సాగునీటి వినియోగాదారుల సంఘాలకు మాజీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి పోటీచేసిన మండపేట నియోజకవర్గంలోని పసలపూడి సాగునీటి సంఘానికి మాత్రం కార్యవర్గాన్ని ప్రకటించలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా అనేకమంది రైతులు వచ్చినా దాన్ని ఏకగ్రీవం చేయకుండా అధికారులు వాయిదా వేశారు. పిఠాపురం బ్రాంచి కెనాల్‌కు సంబంధించి యు.కొత్తపల్లిలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ రావు చిన్నారావు అధ్యక్షుడిగా కమిటీ ప్యానల్‌ను ఇచ్చినప్పటికీ ఏకాభిప్రాయం లేదని అధికారులు ప్రకటించారు. అయితే టీడీపీ ప్యానల్‌కే ఏకాభిప్రాయం వచ్చినట్లు ఇప్పుడు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని సవాలు చేస్తూ రావు చిన్నారావు హైకోర్టును ఆశ్రయించారు.
 
 అధికారులే బలిపశువులవుతారు...
 టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిళ్లకు లొంగి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే న్యాయపోరాటంలో వారే బలిపశువులు కాకతప్పదు. ఏలేరు ఆయకట్టు పరిధిలోని సోమవరం పంపింగ్  స్కీమ్ సంఘం ఎన్నికే అందుకు ఉదాహరణ. ఈ ఆయకట్టు పరిధిలో భూమిలేని టీడీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబుకు ఓటుహక్కు ఎలా కల్పిస్తారని వైఎస్సార్‌సీపీ నాయకులంతా అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. జిల్లా అంతా ఇదేరీతిలో సాగునీటి సంఘాల ఎన్నికల వ్యవహారం సాగింది. దీనిపై న్యాయపోరాటం చేస్తాం.
 - జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement