దోచుకున్నోళ్లకు దోచుకున్నంత | Irregularities In The Transport Office Of Kadapa District | Sakshi
Sakshi News home page

దోచుకున్నోళ్లకు దోచుకున్నంత

Jul 29 2019 10:14 AM | Updated on Jul 29 2019 10:14 AM

Irregularities In The Transport Office Of Kadapa District - Sakshi

ఊటుకూరులోని జిల్లా ఉప రవాణాశాఖ కార్యాలయం

సాక్షి, కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌:  జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలో దళారుల దందా మళ్లీ మొదలైంది. పనులు జరగాలంటే పైసలు ముట్టజెప్పాల్సిందే. పని ఏదైనా ఆమ్యామ్యాలు అప్పచెబితే క్షణాల్లో పనులు చేసి పెడతారు. లేదంటే రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి కళుకలదుటే కనిపిస్తోంది. ఒకప్పుడు కార్యాలయ ఆవరణంలో తిరగాలంటే భయపడే దళారులు ఇప్పుడు అక్కడే తిష్ట వేసి దోపిడీకి దారులు తీస్తున్నారు. జిల్లా ఉప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న బసిరెడ్డి చిత్తూరు జిల్లాకు బదిలీ కావడంతో దళారులు అడ్డంగా దొరికిన కాడికి దోపిడీ చేస్తున్నారు.  ఆయన బదిలీపై వెళ్లిన వెంటనే ఎక్కడో ఉన్న దళారులు కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో పనులు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు.

గతంలో ఉన్న డీటీసీ బసిరెడ్డి రవాణాశాఖ కార్యాలయంలో ఎక్కడా కూడా దళారుల జాడ లేకుండా చేసి ప్రజలే స్వయంగా వచ్చి పనులు చేసుకునేలా వీలు కల్పించారు. రవాణాశాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. దాదాపు ఆయన పని చేసిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో దళారుల ఊసే లేకుండా ఉండింది. ఆయన బదిలీ అనగానే దళారులు ఇక్కడి సిబ్బందితో సంప్రదింపులు జరిపి తమ వ్యాపారం మొదలు పెట్టారు. ఎల్‌ఎల్‌ఆర్‌ నుంచి డ్రైవింగ్‌ టెస్టింగ్‌ వరకు రేట్లను నిర్ణయించారు. కార్యాలయంలో పని చేసే హోంగార్డు నుంచి పైస్థాయి సిబ్బంది వరకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి.

దళారులకు అడ్డాగా ఆన్‌లైన్‌ సెంటర్లు
ఆన్‌లైన్‌ సెంటర్లు దళారులకు అడ్డాగా మారాయి. కొందరు దళారులు రింగు రోడ్డు, నగరంలో ఆన్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌ కావాలంటే దళారులు ఇచ్చే సింబల్‌ ప్రకారం రవాణాశాఖ కార్యాలయ అధికారులు ఎల్‌ఎల్‌ఆర్‌ పాస్‌ చేసి పంపుతున్నారు. దళారీ ద్వారా కాకుండా నేరుగా ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షకు హాజరైతే వారిని ఫెయిల్‌ చేసి పంపుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

టెస్టింగ్‌ కేంద్రం వద్ద ఆ దళారిదే ఇష్టారాజ్యం
వాహనాల డ్రైవింగ్‌ టెస్టింగ్‌ వద్ద చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట పంచాయతీకి  చెందిన ఓ దళారీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. టెస్టింగ్‌ పాస్‌ కావాలంటే టూ వీలర్‌కు రూ.600 నుంచి రూ.800, ఫోర్‌ వీలర్, టూవీలర్‌ పాస్‌ కావాలంటే రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నాడు. ఇదంతే అక్కడున్న మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌కు తెలియదంటే పొరపాటే. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌  ఎదురుగా వసూలు చేస్తున్నా వారు నోరు మెదపకుండా మిన్నకుండి పోతున్నారు. 

ప్రత్యక్షమవుతున్న దళారులు
రవాణా శాఖ కార్యాలయంతో పాటు రింగురోడ్డు సర్కిల్‌ పరిసర ప్రాంతంలో సంచరిస్తూ కార్యాలయానికి వచ్చే వారిని తమ పనులు క్షణాల్లో చేస్తామంటూ వారి నుంచి రేటు నిర్ణయించుకొని పనులు చేసి పంపుతున్నారు.ఈ విషయమై ఇన్‌చార్జ్‌ డీటీసీ శాంతకుమారిని వివరణ కోరగా దళారులను కార్యాలయంలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. దళారులకు సిబ్బంది సహకారం అందిస్తే అలాంటి వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రవాణాశాఖ కార్యాలయంలో దళారుల నివారణే ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement