
అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న సాయి,ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ
పెందుర్తి: పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంపై నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. ఓ భవనం నుంచి మరో భవనం పైకి దూకే ప్రయత్నంలో అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి మారేడుపుడి కాలనీకి చెందిన ముద్దిర్ని రాము కుమారుడు సాయి పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. కళాశాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కంచరపాలెంలోని పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. గురువారం ఉదయం 8.30 సమయంలో కళాశాలకు వచ్చిన సాయి ప్రధాన గేటు ద్వారా లోపలికి వచ్చాడు.
తన తరగతి గది అదనపు భవనంలో ఉండడంతో సులువుగా ఉంటుందని కళాశాల ప్రధాన భవనం మీదకి వెళ్లి అదనపు భవనం వైపు దూకాడు. అయితే అదుపుతప్పి అదనపు భవనం పోర్టుకోకు తగిలి కింద పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. తక్షణమే స్పందించిన తోటి విద్యార్థులు, స్థానికులు ఆటోలో సాయిని కేజీహెచ్‌కు తరలించారు. సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. సీఐ మురళి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.