నిఘా... పచ్చి దగా! | Intelligence Unit Chandrababu works for political purposes | Sakshi
Sakshi News home page

నిఘా... పచ్చి దగా!

Mar 29 2019 2:55 AM | Updated on Mar 29 2019 2:55 AM

Intelligence Unit Chandrababu works for political purposes - Sakshi

సాక్షి, అమరావతి  రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాల్సిన ఇంటెలిజెన్స్‌ విభాగం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తోంది అనడానికి ఇది మరో నిదర్శనం. ఓటమి భయంతో ఉన్న చంద్రబాబును గట్టున పడేసే బాధ్యతను భుజానికెత్తుకున్న ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తన పరిధి దాటి వ్యవహరించారని చెప్పడానికి పలు ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు నిఘా విధులను వదిలేసి, చంద్రబాబు నిర్వహించే టీడీపీ సమావేశాలు, మంత్రివర్గ సమావేశాలకు స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్టు ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల వాట్సాప్‌ గ్రూపుల్లోనూ ఉండి వారి దిశానిర్దేశం చేస్తున్నారనే అభియోగాలున్నాయి. దీనికితోడు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలను సేకరించడం విమర్శలకు తావిస్తోంది.   

ప్రతిపక్ష అభ్యర్థులపైనే గురి 
రాష్ట్రవ్యాప్తంగా సొంత సామాజికవర్గానికి చెందిన అధికారులను ఇంటెలిజెన్స్‌ డీఎస్పీలుగా నియమించుకున్న ఏబీ వెంకటేశ్వరరావు వారి నుంచి రాజకీయ కోణంలోనే నివేదికలను రప్పించుకున్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై నిఘా పెట్టారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నీడలా వెంటాడిన ఇంటెలిజెన్స్‌ సిబ్బంది పలు కీలక వివరాలు సేకరించారు. ఉదాహరణకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి, పాటిల్‌ అజయ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఆశిస్తున్నారని, రామచంద్రారెడ్డికి టిక్కెట్‌ ఇస్తే అజయ్‌కుమార్‌రెడ్డి వర్గం సహకరించదంటూ సమాచారం సేకరించి, తమ బాస్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఇచ్చిన కొద్ది రోజులకే మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఆయన తనయుడు పాటిల్‌ అజయ్‌కుమార్‌రెడ్డి టీడీపీ చేరడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల బలబలాలను అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ఇచ్చే నివేదిక ఆధారంగానే టీడీపీ రాజకీయ వ్యూహాలను రచించుకుంటోంది. పార్టీ ఫిరాయింపులు, టీడీపీలో చేరికల వెనుక పచ్చ చొక్కా తొడుక్కున్న ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వ్యక్తిగతం, ఆర్థిక పరిస్థితి, అతడిపై ఏమైనా కేసులు ఉన్నాయా? వివాదాల్లో ఉన్నాడా? అనే ప్రాథమిక వివరాలు సేకరించారు. అంతటితో ఆగకుండా ప్రతిపక్ష అభ్యర్థి కుటుంబ పరిస్థితి, కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నారు? వారిలో ఏమైనా వివాదాలు ఉన్నాయా? వారి రాజకీయ, సామాజిక పరిస్థితి ఏమిటి? అనే వివరాలు కూడా తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ తరపున బరిలోకి దిగనున్న ఆ అభ్యర్థి ఎంతమేరకు పోటీ ఇస్తాడు? ఇంకా ఎవరెవరు సీటు ఆశించారు? ఒకరికి టిక్కెట్‌ ఇస్తే మిగిలిన వారు సహకరిస్తారా? అనే సమాచారం తీసుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు బలమైన అభ్యర్థి, ఎవరు బలహీనంగా ఉన్నారు? సమీకరణలు ఎవరికి కలిసి వస్తాయి అనే కోణంలోనూ ఆరా తీసి నివేదిక రూపొందించారు. ఇలా క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్‌ సిబ్బంది సేకరించిన వివరాలను ఏబీ వెంకటేశ్వరరావు ఎవరికి నివేదిస్తారో తెలియంది కాదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement