విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాజకీయ పార్టీలు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాజకీయ పార్టీలు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడేవారు. అనతికాలంలోనే ప్రజాదరణ పొందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా తొలిసారి మున్సిపల్ బరిలో దిగుతున్నారు. ఈ మూడు పార్టీలకు తోడు బీజేపీ, లోక్‌సత్తా, వామపక్షాల అభ్యర్థులతోపాటు, ఇండిపెండెంట్లు కూడా పలుచోట్ల పోటీకి దిగుతున్నారు.
దీంతో ఇప్పటికే మున్సిపాలిటీల్లో వాతావరణం వేడెక్కింది. వార్డు స్థాయిలో పెనుసవాళ్లు ఎదురవుతాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. జిల్లాలోని సున్నితమైన, అతి సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆయా వార్డుల్లో వెబ్ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని భావిస్తోంది.
ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రామకాంత్‌రెడ్డి బుధవారం జారీ చేసిన ఓ లేఖలో ఆదేశించారు. అవసరమైతే జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల సేవలను వినియోగించుకోవాని సూచించారు. ల్యాప్‌టాప్‌లు కలిగి వాలంటీర్లుగా పని చేయడానికి ముందుకొచ్చే ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని, ఇందుకోసం ఎన్నికల జరిగే ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలను ముందుగా సంప్రదించాలని పేర్కొన్నారు.
ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలపైనే దృష్టి
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 16 అతిసమస్యాత్మక, 16 సమస్యాత్మక, మరో ఐదు సున్నిత ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. సాలూరు మున్సిపాలిటీలో మూడు సమస్యాత్మక, తొమ్మిది అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. పార్వతీపురంలో రెండు అతిసమస్యాత్మక, తొమ్మిది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులనూ సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఇందులో అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా, సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణ ద్వారా, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల ద్వారా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను జిల్లా యంత్రాంగం పర్యవేక్షించనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే నిఘా ప్రారంభం
వాస్తవానికి వెబ్ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ప్రారంభమైంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్నీ పర్యవేక్షించే వీలుంటుంది.
ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన చోటుచేసుకున్నా తక్షణమే యంత్రాంగం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. వెంటనే దానిని నివృత్తి చేసేందుకు వీలు కుదురుతుంది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ఈ విధానం అమలు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందనే భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.