నాసిరకం కానుకలు..! | Sakshi
Sakshi News home page

నాసిరకం కానుకలు..!

Published Sat, Dec 26 2015 2:56 AM

నాసిరకం కానుకలు..!

* కందిపప్పులో రాళ్లు, పురుగులు  
* నెయ్యి,బెల్లం తూకంలో అవకతవకలు
* రెండు డిపోలకు చేరని సరుకులు  
* అందని సంచులు
* అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

 
లక్కవరపుకోట: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న క్రిస్‌మస్,సంక్రాంతి కానుకల్లో నాసిరకం సరుకులను అందజేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పేదలే కదా ఇచ్చింది తీసుకుంటారు,..అదికూడా ఉచితంగానే కదా ఎలాంటి సరుకులు ఇస్తే ఏమిటి అనుకున్నారో ఏమో.పురుగులు పట్టి,పుచ్చిపోయిన కందిపప్పు.నాసిరకమైన బెల్లం అందజేస్తున్నారని లబ్ధిదారులు అవేదన చెందుతు న్నారు. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి కేజీ గోధుమపిండి,వంద గ్రాముల నెయ్యి,అరకేజీ బెల్లం,కందిపప్పు, శనగపప్పు,పంచదార అరకేజీ చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వస్తువులను వాటి తూకాల ప్రకారం ప్యాకింగ్ చేసి కోట్లు రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచుల్లో అబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఈ సరుకుల్లో బెల్లం అరకేజీకి బదులు 450 గ్రాములు,వంద గ్రాముల నెయ్యికి 90 గ్రాముల నెయ్యి మాత్రమే వస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.అలాగే కందిపప్పులో రాళ్లు, పెంకిపురుగులతో పూర్తిగా నాసిరకం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు.ఈ సరుకులు అందజేసే సంచులు మాత్రం ఒక్కో డిపోకు కేవలం 50 చొప్పున  అందజేశారు. ఆ సంచుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియక డీలర్లు అయోమయంలో ఉన్నారు.

క్రిస్‌మస్ పూర్తయినా అందని సరుకులు
ప్రస్తుతం అదికారులు ముందస్తుగా క్రైస్తవ మతస్తులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను క్రిస్‌మస్ పర్వదినానికి అందజేసేందుకు సిద్ధమయ్యారు. కాగా నేటికీ వేపాడ మండలంలోని చిన్నదుంగాడ,వేపాడ డిపోలకు సరుకుల సరఫరా జరగేదు.మరికొన్ని డిపోల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ జరగలేదు.

లక్కవరపుకోట మండలంలోని 15,834కార్డులు,వేపాడ మండలంలో 14,633కార్డులు  ఉన్నాయి. సర్వర్‌లు సక్రమంగా పనిచేయకపోవడంతో శుక్రవారం నాటికి కేవలం 5శాతం మందికి మాత్రమే సరుకులను అందజేశారు.
 
లబ్ధిదారుల్లో అసహనం
ప్రభుత్వం అందజేస్తున్న సరుకుల్లో తూకాలు సక్రమంగా లేవని అదికూడా నాసిరకమైన సరుకులు అందజేయడంతో పలువురు లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రచారం తప్ప సరుకుల్లో నాణ్యత లేదని వాపోతున్నారు. ఇచ్చింది గోరంత అయితే ప్రచారం మాత్రం కొండంతగా  ఉందని అంటున్నారు. దీపావళికి కేజీ పంచదార అందజేస్తామని ప్రకటించారు. కాగా ఆరకేజీ చొప్పునే అందజేశారని పలువురు వాపోతున్నారు.
 
ఈ విషయమై సీఎస్‌డీటీ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా..సరుకుల కొలతలో తేడాలు వస్తున్నట్లు,నాణ్యత విషయంపై పలువురి దగ్గరనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అంగీకరించారు. ఈ విషయాలను పై అధికారులకు తెలియజేశామని చెప్పారు.  
 
మేము చేసిన ప్యాకింగ్‌లు కావు
చంద్రన్న కానుకకు సంబంధించిన సరుకులు మేము ప్యాకింగ్ చేయలేదు. ప్యాకింగ్ చేసిన వస్తువులే మాకు అందజేశారు.ఆసరుకులే లబ్ధిదారులకు అందజేస్తున్నాం. తూకంలో కొద్దిపాటి తేడాలు రావడము వాస్తవమే.
- ఐ.ముత్యాలు,ఆర్.జి.పేట డీలర్

సరుకులు బాగోలేవు
ప్రస్తుతం కోటాలో ఇస్తున్న పండగ సరుకులు బాగోలేవు. బెల్లం,నెయ్యి తూకం వేస్తే తక్కువ వస్తున్నాయి.డీలర్లను అడిగితే వారు ఇచ్చిందే పంచుతున్నామంటున్నారు.
-ఆర్.సత్యవతి,శ్రీరాంపురం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement