కొలువుల శకం.. యువతోత్సాహం | Increased interest among young people on government jobs | Sakshi
Sakshi News home page

కొలువుల శకం.. యువతోత్సాహం

Nov 3 2019 4:25 AM | Updated on Nov 3 2019 4:30 AM

Increased interest among young people on government jobs - Sakshi

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పైరవీలకు, అనుమానాలకు తావివ్వకుండా ఇంటర్వూ్య మార్కులు తీసేయడంతో నిరుద్యోగుల్లో మెరిట్‌ ఉన్న వాళ్లకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం పెరిగింది. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల శకం మొదలైంది. అదృష్టమో, రికమండేషనో, డబ్బులు పెడితేనో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే రోజులకు కాలం చెల్లింది. కష్టపడిన వారికి, ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ ఉద్యోగం పెద్ద కష్టం కాదనే పరిస్థితి వచ్చింది. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువత బాగా ఉత్సాహం చూపుతోంది. వెరసి పోటీ పరీక్షలకు పెద్దఎత్తున సన్నద్ధమవుతున్నారు. 90వ దశకంలో ప్రారంభమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల ఆకర్షణ కొద్ది కాలంగా తగ్గుతూ వస్తోంది. సాఫ్ట్‌వేర్‌ కంటే ప్రభుత్వ ఉద్యోగాలే ఉత్తమమని నమ్ముతున్న యువత ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకే జాతీయ స్థాయిలో జరిగే బ్యాంకు పరీక్షలు, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ పరీక్షలతో పాటు రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ పోస్టులకు లక్షలాది మంది పోటీ పడుతున్నారు.  

మొన్నటి దాకా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌సీ నిర్వహించే గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4 తదితర పరీక్షలను ఐదు లక్షల మందికిపైగా రాస్తున్నారు. టీచర్‌ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ పరీక్షలకు మూడు లక్షల మంది, కానిస్టేబుల్‌ తదితర పరీక్షలకు లక్ష మందికిపైగా హాజరవుతున్నారు. ఈ పరీక్షల పట్ల నిరుద్యోగుల్లో ఆసక్తి ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం చాలా నామమాత్రంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఒక షెడ్యూల్‌ లేకపోవడం, కోర్టు కేసులు వంటి కారణాల వల్ల వాటి భర్తీకి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుండడంతో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగుల్లో నమ్మకం సడలిపోయింది. 

ఒకేసారి 1.26 లక్షల ఉద్యోగాలతో  పెరిగిన నమ్మకం
రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నెల రోజుల్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి లక్షా 26 వేల ఉద్యోగాలను విప్లవాత్మక రీతిలో భర్తీ చేయడంతో నిరుద్యోగ యువత దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగాల కోసం 22 లక్షల మంది దరఖాస్తు చేసుకుని 19.50 లక్షల మంది పరీక్ష రాయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువతలో ఉన్న ఆకర్షణ వ్యక్తమైంది. ఇంత మంది పరీక్ష రాయడం దేశ చరిత్రలో ఒక రికార్డుగా చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా ఉంటుందనే నమ్మకం ఏర్పడడంతో నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లకు భారీగా క్యూ కడుతున్నారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో కోచింగ్‌ సెంటర్లలో నిరుద్యోగులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. వచ్చే జనవరిలో టీచర్, సచివాలయాలు, ఇతర ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు వెలువడతాయని గట్టి నమ్మకం ఏర్పడడంతో కొత్తగా కోచింగ్‌ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. చాలా మంది చిన్న చిన్న ప్రైవేట్‌ ఉద్యోగాలను వదిలేసి, సెలవుపెట్టి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.  

సచివాలయ పరీక్షల్లా నిర్వహించాలి
సచివాలయ ఉద్యోగాల పరీక్షలు జరిగినట్లు అన్ని పోటీ పరీక్షలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఉద్యోగాలతో యువతలో కొంత నమ్మకం వచ్చింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా ఉంటే నిరుద్యోగుల్లో మరింత భరోసా ఏర్పడుతుంది. సీఎం వైఎస్‌ జగన్‌.. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారనే ధైర్యాన్ని ఇచ్చారు.
– కే శ్రీధర్, శ్రీధర్‌ కాంపిటీటివ్స్‌ సెంటర్, విజయవాడ
– ఎస్‌ పూర్ణచంద్రరావు, ప్రగతి కోచింగ్‌ సంస్థ, అవనిగడ్డ

ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది
గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏపీపీఎస్‌సీ పనితీరు సక్రమంగా లేదు. దీనివల్ల పేద, గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల్లో విశ్వాసం కలిగింది. గత ప్రభుత్వంలో ఆ విశ్వాసం లేదు. ఏటా నోటిఫికేషన్లు ఇస్తే ప్రభుత్వంపై ఇంకా నమ్మకం పెరుగుతుంది. 
    – కేఎస్‌ లక్ష్మణరావు, విద్యావేత్త, ఎమ్మెల్సీ 

ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా..
గతంలో ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసేదాన్ని. ఈ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల కోసం నోటిషికేషన్లు ఇస్తామని ప్రకటించడం మాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. రెండేళ్లలో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. అదే నమ్మకంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా.     
– కే రేణుకాదేవి, దంగేరు, కె.గంగవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement