ఇసుక ర్యాంపుల్లో అవినీతి కంపు | illegal sand mining in Nidadavole | Sakshi
Sakshi News home page

ఇసుక ర్యాంపుల్లో అవినీతి కంపు

Mar 9 2015 1:03 AM | Updated on Aug 28 2018 8:41 PM

నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న మూడు ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. డ్వాక్రా మహిళల

 నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న మూడు ఇసుక ర్యాంపుల  నుంచి ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. డ్వాక్రా మహిళల ముసుగులో ప్రజాప్రతినిధులు, అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ర్యాంపుల్లో నిబంధనలకు గాలికొదులుతూ ఇష్టానుసారంగా దొరికినకాడికి దోచేస్తున్నారు. నిడదవోలు మండలంలో పెండ్యాల, పందలపర్రు ర్యాంపులతో పాటు ఇటీవల ర్యాంపు పనులు చేపట్టిన తీపర్రులో అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. పెండ్యాల ఇసుక ర్యాంపులో రెండు రోజుల క్రితం దొంగ వేబిల్లులతో ఇసుక రవాణా జరుగుతోందని అందిన సమాచారంతో వచ్చిన పోలీసులు లారీలను తనిఖీలు చేశారు. దొంగ వేబిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న కొన్ని లారీలనుపట్టుకుని రెవెన్యూ అధికారులకు వేబిల్లులను పంపించారు. అయితే ముందు నుంచి ఇసుక రవాణాకు వత్తాసు పలుకుతూ ఏమి తెలియనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు ఈ బిల్లులు సరైనవేనని సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. రెవెన్యూ అధికారులు పూర్తిగా ఓ ప్రజాప్రనిధి చెప్పుచేతల్లో విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు ప్రజాప్రతినిధులు, అటు ఇసుక మాఫియా చేతుల్లో నలిగిపోతున్నామని నియోజకవర్గ పరిధిలో పేరు చెప్పడానికి ఇష్టపడని రెవెన్యూ అధికారి ఒకరు వాపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రజాప్రతినిధి ఒత్తిడితో పోలీసులు గుర్తించిన నకిలీ వేబిల్లులను పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఇవి కరెక్టుగానే ఉన్నాయనే తేల్చిచెప్పినట్టు తెలిసింది.
 
 నిబంధనలకు నీళ్లు.. ఇసుకకు కాళ్లు
 నిబంధనల ప్రకారం ఇసుక ర్యాంపుల్లో సాయంత్రం 6 గంటలు దాటాక ఇసుక రవాణా చేయరాదు. కాని రాత్రి, పగలు తేడా లేకుండా రోజుకి ఒక్కో ర్యాంపు నుంచి సుమారు 200 లారీలు వెళుతున్నాయి. అంతే కాకుండా సదరు ప్రజాప్రనిధి అనుచరులు ర్యాంపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు యూనిట్లకు బిల్లులు తీసుకుని ర్యాంపుల వద్దకు వెళితే అక్కడ కొందరు లారీ డ్రైవర్ల వద్ద అదనంగా సొమ్ము తీసుకుని ఆరు నుంచి, ఎనిమిది యూనిట్లు వేస్తున్నారు. ఇదే ఆంశంపై గతంలో డ్వాక్రా మహిళలు అడ్డుకుని ఇసుక అక్రమ రవాణాను వెలుగులోకి తీసుకువచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు లారీలకు జరిమానాలు విధించారు కూడా.
 
 మూడురోజులుగా విజిలెన్స్ తనిఖీలు
 ఇటీవల నిడదవోలు మండలం పెండ్యాల, పందలపర్రు ర్యాంపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు రావడంతో మూడు రోజులుగా ఇసుక ర్యాంపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మండలంలో పందలపర్రు ఇసుక ర్యాంపులో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు పలు రికార్డులు పరిశీలించారు. పందలపర్రు ర్యాంపులో ఎంత లోతులో ఇసుక తవ్వకాలు జరిగాయి అనే దానిపై కొలతలు చేపట్టారు. ప్రభుత్వం అనుమతించిన సరిహద్దులలో కాకుండా బయట ఇసుక తవ్వకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. పందలపర్రు ర్యాంపు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 71వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రికార్డుల్లో మాత్రం 67 వేల క్యూబిక్ మీటర్లు తవ్వినట్టు ఉంది. ర్యాంపులో 4 వేల క్యూబిక్ మీటర్ల తేడా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత మేర తవ్వడానికి అనుమతులు ఉన్నాయి. సరిహద్దులను దాటి ఏ మేరకు ఇసుక తవ్వకాలు జరిగాయనే దానిపై అధికారులు లెక్కలు తేల్చాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement