అదే దందా | illegal sale of Tirupati Laddu's at Tirumala Temple | Sakshi
Sakshi News home page

అదే దందా

Apr 16 2017 10:08 AM | Updated on Aug 28 2018 5:55 PM

అదే దందా - Sakshi

అదే దందా

తిరుమలేశుని లడ్డూల అక్రమ దందా ఆగడం లేదు.

► తిరుమలలో ఆగని లడ్డూ అక్రమ విక్రయాలు
► ఇంటిదొంగల చేతివాటంతో పెచ్చుమీరుతున్న వైనం
► పట్టించుకోని విజిలెన్స్‌ విభాగం
► వేసవిలో మరిన్ని విక్రయాలకు రంగం సిద్ధం

తిరుమలేశుని లడ్డూల అక్రమ దందా ఆగడం లేదు. ఇంటిదొంగల చేతివాటంతో దళారులు రెచ్చిపోతున్నారు. అందినకాడికి లడ్డూలను అడ్డదిడ్డంగా అమ్మేస్తున్నారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని అక్రమ విక్రయాలు సాగించేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.

సాక్షి, తిరుమల : తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడరు. భక్తుల అవసరాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. లడ్డూ దళారులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో లడ్డూ టోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్‌ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్‌ సిబ్బంది, లడ్డూ ట్రే లిఫ్టర్లు.. ఇలా సామూహికంగా కలసిపోయి అక్రమ దందాను నడిపిస్తున్నారు. భక్తులకు అందాల్సిన లడ్డూలను నల్లబజారులోకి తరలిస్తున్నారు.

సరిపడా లడ్డూలు తయారు చేస్తున్నా..
సరాసరిగా రోజూ 72 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వీరికోసం టీటీడీ రోజూ 3 లక్షల లడ్డూలు తయారుచేసి విక్రయిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఒక్కొక్కరికి 4 (రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), కాలిబాట భక్తులకు ఒకరికి 5 (ఒకటి ఉచితం, రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), రూ.300 టికెట్ల భక్తులకు ఒకరికి 2, వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల భక్తులకు ఒకరికి 2, వివిధ దర్శన టికెట్లతోపాటు అదనపు లడ్డూల కోసం రూ.25 నగదు చెల్లించిన వారికి 2 నుంచి 6 లడ్డూలు పొందవచ్చు. టీటీడీ తయారు చేసే లడ్డూలు భక్తులకు చాలడం లేదు. భక్తులు బయటవ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది.

దొడ్డిదారిలో కాలిబాట టోకెన్లు, సబ్సిడీ లడ్డూ  టోకెన్ల దాటవేత
ఓ లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.35 దాకా ఖర్చవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తోంది. కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. రూ.25 చొప్పున రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తుంటారు. కాలిబాటలో వచ్చిన భక్తులకు ఒకరికి ఉచిత లడ్డూతో కలిపి 5 లడ్డూ టోకెన్లు, సర్వదర్శనం భక్తులకు 4 లడ్డూల టోకెన్లు పొందే అవకాశం ఉంది. వీటిలో దాదాపు 20 శాతం వరకు దొడ్డిదారిలో తరలివెళుతున్నట్టు విమర్శలున్నాయి.

ఇంటిదొంగల చేతివాటంతోనే..
కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లకు ఒక లడ్డూ ఉచితంగా పొందవచ్చు. అలాంటి టోకెన్లను కొందరు సిబ్బంది దొడ్డిదారిన దళారులకు అందజేస్తుంటారు. వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొందరు స్కానింగ్‌ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని పద్ధతి ప్రకారం స్కానింగ్‌ చేస్తారు. వాటిని వెలుపల ట్రేలిఫ్టర్లు దళారులకు అందజేస్తారు. కాలిబాట భక్తులకు రూ.20 రెండు లడ్డూల సబ్సిడీ టోకెన్లు కూడా అదే పద్ధతి ప్రకారమే వెలుపల దళారులకు అందజేస్తారు. వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు.

అక్రమ వాటాలు
శ్రీవారి లడ్డూ అక్రమ విక్రయాల్లో ఇంటి దొంగలదే హవా. కౌంటర్‌ సిబ్బంది నుంచి ట్రే లిఫ్టర్ల వరకు ఎక్కువ మంది ఈ అక్రమాల్లో వాటాదారులే. కొందరు నేరుగా భక్తులకు లడ్డూలు విక్రయిస్తుంటారు. మరికొందరు దళారులతో ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు. ఆలయ సమీప ప్రాంతాల్లో సుమారు 200మందికిపైగా లడ్డూ దళారులు అక్రమ విక్రయాలు సాగిస్తున్నట్టు సమాచారం.

ఇంటి దొంగల్ని పట్టించుకోని విజిలెన్స్‌
టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఇంటిదొంగల విషయంలో చోద్యం చూస్తోంది. దీనికి కారకులైన ఇంటిదొంగల్ని ఏరివేయడంలో సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాలతో కొన్నాళ్లు తగ్గినా మళ్లీ లడ్డూల అక్రమ దందా పుంజుకుంది. ఈ వేసవి రద్దీలో కాసులు దండుకోవాలని ఇంటిదొంగలు, దళారులు నిమగ్నమైనట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement