ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు

illegal activities In Sarvajana Hospital - Sakshi

మహిళా రోగులు, సిబ్బందే టార్గెట్‌

బరితెగిస్తున్న కొందరు పురుష సిబ్బంది

ప్రేక్షకపాత్ర వహిస్తున్న ఆస్పత్రి యాజమాన్యం

అనంతపురం న్యూసిటీ:నగరంలోని సర్వజనాస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. కొందరు పురుష సిబ్బంది మహిళా రోగులు, సిబ్బందిపై కన్నేస్తున్నారు. మాయమాటలతో లోబర్చుకుని ఆస్పత్రి ప్రాంగణంలోనే చనువుగా మెలుగుతున్నారు. ఓపీ, మందులిచ్చే ప్రాంతంలోనూ క్యూలో నిల్చున్న మహిళను అదేపనిగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో సదరు పురుష సిబ్బంది మరింతగా రెచ్చిపోతున్నారు. తామేమి చేసినా ఎవ్వరూ ఏమీ చేయరనే ధీమాతో బరితెగిస్తున్నారు. 

రోగుల తాకిడి
సర్వజనాస్పత్రిలో ఆరు నెలలుగా రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. అనారోగ్యాలు, ప్రమాదాలు, వివిధ సమస్యలతో ఇక్కడ చేరుతున్న వారితో 24 గంటలూ కిటకిటలాడుతోంది. మహిళా సిబ్బంది కూడా షిఫ్టులవారీగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. రోగులకైనా, మహిళా సిబ్బందికైనా సహాయం చేసే పేరుతో కొందరు పురుష సిబ్బంది చనువు పెంచుకుంటున్నారు.

అపవిత్రమవుతున్న వైద్యాలయం
ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున 3.29 గంటల సమయంలో ఓ పురుష సిబ్బంది మార్చురీ పక్కన ఉన్న షెడ్డులోకి వెళ్లాడు. 3.30 గంటలకు ఓ మహిళా సిబ్బంది అదే షెడ్డులోకి వెళ్లింది. దాదాపు గంటన్నర సమయం అందులోనే గడపడం దుమారం రేపుతోంది. వీరిని కొందరు సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా ఎటువంటి చర్యలూ లేవు. ఆస్పత్రి యాజమాన్యం బాధ్యులను పిలిపించి హెచ్చరికలు చేసి.. పనితీరు మార్చుకునే విధంగా కౌన్సిలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

విచారణకు ఆదేశించారు
సెక్యూరిటీగార్డుపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ లలితను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టి నివేదికను సూపరింటెండెంట్‌కు అందజేశారు. అయినా సెక్యూరిటీ గార్డును తీసేశామని సెక్యూరిటీ నిర్వాహకులు చెప్పారు. తీసేశారో లేదో తెలియదు. – డాక్టర్‌ విజయమ్మ,ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top