
నేను చంద్రబాబులాగా చెప్పను: వైఎస్ జగన్
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరం లేని విషయాలు ప్రస్తావనకు తెచ్చారు.
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరం లేని విషయాలు ప్రస్తావనకు తెచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్హతల విషయాన్ని సీఎం తన చర్చలోకి లాక్కొచ్చారు. అయితే సీఎం వ్యాఖ్యలకు వైఎస్ జగన్ దీటుగా సమాధానం ఇవ్వడమే కాకుండా, చురకలు అంటించారు.
తాను బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదవానని, తాను అన్నింటిలోనూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌నని వైఎస్ జగన్ అన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీలోనూ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాయని ఆయన తెలిపారు. అయితే తాను సీఎం చంద్రబాబులాగా ఎంఫిల్ చదవకున్నా చదివానని చెప్పనని, ఆయనలా పీహెచ్‌డీ డిస్‌కంటిన్యూ చేయలేదంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
ఇంత దారుణంగా ఇంగ్లీష్ మాట్లాడే ముఖ్యమంత్రిని చూడలేదని, పక్క రాష్ట్రం మంత్రే ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. కాగా అంతకు ముందు చంద్రబాబు... తాను వెంకటేశ్వర యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివానని, అయితే ప్రతిపక్ష నేత ఎక్కడ చదివారో తెలియదంటూ వ్యాఖ్యలు చేశారు. దానిపై వైఎస్ జగన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అన్నారు.