పార్వతీపురంలో సర్పంచ్‌ల సంఘ సమావేశం ఉందని తమను తీసుకువెళ్లారని, ఎవరినీ కలవనీయకుండా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురంలో సర్పంచ్‌ల సంఘ సమావేశం ఉందని తమను తీసుకువెళ్లారని, ఎవరినీ కలవనీయకుండా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పేశారని కానీ తాము టీడీపీలో చేరలేదని గుమ్మలక్ష్మీపురం మండలంలోని వంగర, కొండవాడ పంచాయతీలకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ సర్పంచ్‌లు పత్తిక సుకటమ్మ, తాడంగి రాధమ్మలు ప్రకటించారు. ఈ మేరకు శనివారం వారు వత్తాడ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. తాము టీడీపీలో చేరినట్లు ఓ పత్రికలో (సాక్షి కాదు) శనివారం ప్రకటన వచ్చిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్వతీపురంలో సమావేశం ఉందని చెప్పి కారులో తీసుకువెళ్లారని, మిగతా సర్పంచ్లు ఎక్కడున్నారని అడిగితే, వారంతా వేరే కార్లో వస్తున్నారని చెప్పారని, పార్వతీపురంలో తమకు బలవంతంగా తెలుగుదేశం కండువాలను వేశారని వివరించారు. ఇది నీచమైన చర్య అని వారన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి చర్యలను ఇక నుంచైనా మానుకోవాలని హితవు పలికారు.