మనసు చలించింది...

Hyderabad Youth Helps Old Couple in Kanekallu Anantapur - Sakshi

 కణేకల్లులో వృద్ధదంపతులను ఆదుకున్న హైదరాబాదీలు

సాక్షి, కణేకల్లు: నిరాశ్రయులైన స్థానిక ఓ వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితిని ఫేస్‌బుక్‌ ద్వారా తెలుసుకున్న హైదరాబాదీలు స్పందించారు. అక్కడి నుంచి వచ్చి శాశ్వత షెడ్‌ ఏర్పాటు చేయించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కణేకల్లులో అంజినమ్మ, రామాంజినేయులు వృద్ధ దంపతులు. ఎవరి తోడు లేక మెయిన్‌రోడ్డులోని ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ వారు పడుతున్న వేదనను స్థానిక యువకుడు వినోద్‌ (సప్తగిరి చిన్న) ఫేస్‌బుక్‌లో హలో యాప్‌ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని హలో యాప్‌ ద్వారా చూసిన ఫీడ్‌ ది హంగర్‌ ఫర్‌ కేఎస్‌కే ఆర్గనైజేషన్‌ సభ్యులు కావ్య, శ్రీకాంత్, కృష్ణ చలించిపోయారు. వినోద్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించి, మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి కణేకల్లుకు చేరుకున్న వారు పూరిగుడిసెను తొలగించి, పటిష్టమైన రేకుల షెడ్‌ వేసి, వృద్ధ దంపతులను అందులో చేర్చారు. ఇందు కోసం దాదాపు రూ. 30 వేలు ఖర్చు పెట్టారు. వీరి ఔదార్యాన్ని చూసిన స్థానిక యువకులు బాషా, సంతోష్, రమేష్, జావీద్, జాకీర్, పాషా అందులో సభ్యులుగా చేరి, షెడ్‌ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 

పాత గుడిసెను తొలగిస్తున్న కేఎస్‌కే టీమ్‌

ఎవరు వీరు..  
హైదరాబాద్‌లోని రివ్లోన్‌ కాస్మోటిక్‌ కంపెనీలో సౌత్‌ ట్రైనర్‌గా కావ్య, సేల్స్‌ మేనేజర్‌గా కృష్ణ పనిచేస్తున్నా్నరు. శ్రీకాంత్‌ ఇంకా చదువుకుంటున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు.  తమ సంపాదనలో కొంత మేర నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద స్వయంగా వంటలు చేసి నిరుపేదల ఆకలి దప్పికలు తీరుస్తుంటారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తుంటారు.

నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top