breaking news
ksk
-
కేఎస్కే మహానది ఖాతా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) మొండిబకాయి(ఎన్పీఏ)గా మారిన కేఎస్కే మహానది పవర్ కంపెనీ రుణ ఖాతాను విక్రయించింది. ఆదిత్య బిర్లా ఏఆర్సీకి రూ. 1,622 కోట్లకు ఖాతాను బదిలీ చేసింది. ఈ(2022) ఏప్రిల్‌కల్లా కేఎస్కే మహానది చెల్లించాల్సిన రుణాల విలువ రూ. 3,815 కోట్లుకాగా.. 58 శాతం కోత(హెయిర్‌కట్)తో ఖాతాను ఏఆర్సీకి ఎస్బీఐ విక్రయించింది. కేఎస్కే మహానది పవర్ ఎన్పీఏ ఖాతాను ఎస్బీఐ నగదు ప్రాతిపదికగా ఈవేలం నిర్వహించింది. ఇందుకు రూ. 1,544 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించినట్లు ఎస్బీఐ వెల్లడించింది. కాగా.. మొత్తం 15 ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ లభించినప్పటికీ ఏబీ ఏఆర్సీ నుంచి రూ. 1,544 కోట్లకు ఒకే బిడ్ దాఖలుకావడం గమనార్హం! స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టిన వేలం విధానంలో పోటీ బిడ్స్ దాఖలుకానప్పటికీ తదుపరి చర్చలతో బిడ్‌ను రూ. 1,622 కోట్లకు ఏబీ ఏఆర్సీ సవరించింది. ఇందుకు తగిన అనుమతులు పొందాక ఈ నెల 12న ఎస్బీఐ విక్రయాన్ని పూర్తి చేసింది. 2009లో ఏర్పాటైన కేఎస్కే మహానది పవర్ రెండేళ్లుగా కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. -
మనసు చలించింది...
సాక్షి, కణేకల్లు: నిరాశ్రయులైన స్థానిక ఓ వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితిని ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న హైదరాబాదీలు స్పందించారు. అక్కడి నుంచి వచ్చి శాశ్వత షెడ్ ఏర్పాటు చేయించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కణేకల్లులో అంజినమ్మ, రామాంజినేయులు వృద్ధ దంపతులు. ఎవరి తోడు లేక మెయిన్‌రోడ్డులోని ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ వారు పడుతున్న వేదనను స్థానిక యువకుడు వినోద్ (సప్తగిరి చిన్న) ఫేస్బుక్లో హలో యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని హలో యాప్ ద్వారా చూసిన ఫీడ్ ది హంగర్ ఫర్ కేఎస్కే ఆర్గనైజేషన్ సభ్యులు కావ్య, శ్రీకాంత్, కృష్ణ చలించిపోయారు. వినోద్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి, మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కణేకల్లుకు చేరుకున్న వారు పూరిగుడిసెను తొలగించి, పటిష్టమైన రేకుల షెడ్ వేసి, వృద్ధ దంపతులను అందులో చేర్చారు. ఇందు కోసం దాదాపు రూ. 30 వేలు ఖర్చు పెట్టారు. వీరి ఔదార్యాన్ని చూసిన స్థానిక యువకులు బాషా, సంతోష్, రమేష్, జావీద్, జాకీర్, పాషా అందులో సభ్యులుగా చేరి, షెడ్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. పాత గుడిసెను తొలగిస్తున్న కేఎస్కే టీమ్ ఎవరు వీరు.. హైదరాబాద్‌లోని రివ్లోన్ కాస్మోటిక్ కంపెనీలో సౌత్ ట్రైనర్‌గా కావ్య, సేల్స్ మేనేజర్‌గా కృష్ణ పనిచేస్తున్నా్నరు. శ్రీకాంత్ ఇంకా చదువుకుంటున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు. తమ సంపాదనలో కొంత మేర నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద స్వయంగా వంటలు చేసి నిరుపేదల ఆకలి దప్పికలు తీరుస్తుంటారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తుంటారు. నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులు -
విద్యుత్‌కు బొగ్గు భరోసా!
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి రంగానికి ప్రభుత్వం కాస్త చేయూతనిచ్చే నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతుల్లో అడ్డుంకుల కారణంగా బొగ్గు గనుల అభివృద్ధి చేపట్టని విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరాను పెంచేందుకు ఓకే చెప్పింది. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) గురువారం ఇక్కడ జరిపిన భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. పర్యావరణ, అటవీశాఖ అనుసరిస్తున్న అనుకూల(గో), నిషేధిత(నో-గో) విధానం కారణంగా మొత్తం 24 విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఇందులో 9 ప్రాజెక్టులకు మరింత బొగ్గును సరఫరా చేయడానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీఎంఆర్ రెండు ప్రాజెక్టులు కూడా... కేబినెట్ ఆమోదించిన జాబితాలో స్టెరిలైట్, జీఎంఆర్, కేఎస్కే మహానది పవర్లకు చెందిన రెండేసి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిప్రకారం పర్యావరణ అనుమతుల జాప్యంతో మైనింగ్ అభివృద్ధి నిలిచిపోయిన పవర్ ప్లాంట్లకు మరో మూడేళ్లపాటు క్రమానుగత(ట్యాపరింగ్) బొగ్గు లింకేజీ విధానం కింద సరఫరా చేయనున్నారు. అయితే ఈ విధానం ప్రకారం ఎంత పరిమాణంలో బొగ్గు సరఫరా చేయాలనేది ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్ఎస్ఏ) ద్వారా నిర్ణయించనుండగా.. అదనపు సరఫరా పరిమాణాన్ని లభ్యతకు లోబడి అవగాహన ఒప్పందాల(ఎంఓయూ) ప్రాతిపదికన ఇవ్వనున్నారని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సరఫరా ప్రక్రియను ప్రతి ఏడాది చివర్లో బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతోపాటు ప్రణాళిక సంఘం కలిసి సమీక్షించనున్నాయి. రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు... ప్రభుత్వం అదనపు బొగ్గు సరఫరాలకు ఓకే చెప్పిన 9 పవర్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం 11 వేల మెగావాట్లుగా అంచనా. వీటికి పెట్టుబడుల మొత్తం దాదాపు రూ.60 వేల కోట్లు. ఈ ప్లాంట్లకు ఇప్పటికే సొంత బొగ్గు సరఫరా బ్లాక్‌లు ఉన్నాయి. అయితే, పర్యావరణ అనుమతుల విషయంలో అడ్డంకులతో ఈ గనుల్లో తవ్వకాలకు వీల్లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ట్యాపరింగ్ బొగ్గు లింకేజీ కింద మూడేళ్ల సరఫరాలకు బదులు మరో మూడేళ్లు అదనంగా సరఫరా చేయాలని ప్లాంట్లు విజ్ఞప్తి చేశాయి. విద్యుత్ శాఖ కూడా దీనికి సిఫార్సు చేయడంతో కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఎయిరిండియా బోయింగ్‌ల అమ్మకానికి ఓకే.. ఎతిహాద్ ఎయిర్వేస్కు అయిదు బోయింగ్ 777 విమానాలను విక్రయించాలన్న ఎయిరిండియా ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. గత నెలలోనే ఎతిహాద్‌తో డీల్‌ను ఎయిరిండియా ఖరారు చేసుకుంది. ఈ ఒప్పందంతో ఎయిరిండియాకు 30-35 కోట్ల డాలర్ల వరకూ(గరిష్టంగా రూ.2,200 కోట్లు) లభించవచ్చని అంచనా. టర్న్‌ఎరౌండ్ ప్రణాళికలో భాగంగా కంపెనీకి ఉన్న రూ.20,000 కోట్ల రుణ భారంలో కొంత మొత్తాన్ని తీర్చేందుకు వినియోగించనుంది. 11 ఖాయిలా పరిశ్రమలకు రూ.117 కోట్లు ఖాయిలా పడిన 11 ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)లకు రూ.116.86 కోట్లను కేటాయించేందుకు సీఈఈఏ ఆమోదం తెలిపింది. వేతనాలు, ఇతర బకాయిల కింద ఈ నిధులను ఆయా సంస్థలు వినియోగించనున్నాయి. ఈ నిధులు అందనున్న పరిశ్రమల్లో హిందుస్తాన్ కేబుల్స్, హెచ్ఎంటీ మిషన్ టూల్స్, హెచ్ఎంటీ(వాచెస్), హెచ్ఎంటీ(చినార్ వాచెస్), నాగాలాండ్ పల్ప్ అండ్ పేపర్, త్రివేణి స్ట్రక్చర్స్, తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్, నాపా లిమిటెడ్, హెచ్ఎంటీ బేరింగ్స్, హిందుస్తాన్ ఫొటో ఫిలిమ్స్, టైర్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో పీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, బోనస్ వంటి చట్టబద్ధ బకాయిలు, వేతన బకాయిల కింద ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది.