రాష్ట్ర విభజనంటూ జరిగితే తెలంగాణ, సీమాంధ్రతో పాటు హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనంటూ జరిగితే తెలంగాణ, సీమాంధ్రతో పాటు హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గొల్లకురుమ హక్కుల పోరాట సమితి (జీకేహెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో ‘హైదరాబాద్‌లో ప్రాంతాలకు అతీతంగా కులాల రక్షణ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ అంశంపై నిర్ణయం రాకముందే బెదిరింపు ప్రకటనలు చేస్తున్నారని, ప్రాంతీయ పార్టీలు బడుగు, బలహీన వర్గాల్లో పుట్టి అగ్రకులాల అధీనంలో ఉన్నాయని విమర్శించారు.
అణగారిన వర్గాల వారే సీఎం కావాలని, హైదరాబాద్‌ను మొదట పాలించింది ముస్లింలే కాబట్టి అక్బరుద్దీన్‌ను సీఎం చేస్తామని ప్రకటించారు. దళిత ఉద్యమ నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ గడీల దొరలే తెలంగాణ కావాలంటున్నారని, దొరల తెలంగాణ మాకు వద్దన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరుగుతుందో స్పష్టం చేయాలని, లేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్నారు.