
వైష్ణవితో ఆమె తమ్ముడు, చెల్లి.. వీరు తలదాచుకుంటున్న పంపు హౌస్
కదిరి(అనంతపురం జిల్లా): నేను.. నా కుటుంబం.. అనే స్వార్థాన్ని పక్కనపెట్టి ఇతరుల కష్టాలను కూడా తమవిగా భావించే మనసులు కూడా ఈ సమాజంలో ఉన్నాయని మరోసారి నిరూపితమైంది. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందగా ముగ్గురు పిల్లలు పంప్‌హౌస్‌లో దుర్భర జీవనం గడుపుతున్న వైనాన్ని ‘నువు లేక అనాథలం’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 5వ తేదీన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ఎన్నో హృదయాలను కదిలించింది. ఆ పిల్లలు అనాథలే కావచ్చు.. కానీ మేమంతా బంధువులమేనంటూ ఎంతో మంది ముందుకొచ్చారు. వాళ్లను చదివించడంతో పాటు బాగోగులనూ చూసుకుంటామని భరోసానిచ్చారు. వీరిలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఒకరు. ఉదయాన్నే కథనం చదివిన ఆయన ఆర్డీఓ రామమోహన్ ఫోన్‌లో సంప్రదించారు. ఆ పిల్లలను తక్షణం ఆదుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు తలుపుల మండల తహసీల్దార్ శివయ్య పిల్లలు నివాసం ఉంటున్న పంప్‌హౌస్ వద్దకు చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు పంపుతామన్నారు. తక్షణ సాయంగా 25 కిలోల బియ్యం అందజేశారు. అక్కడికక్కడే ఇల్లును మంజూరు చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించేందుకు కలెక్టర్ సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇకపోతే ఎంతో మంది దాతలు కథనానికి స్పందించి ‘సాక్షి’ని ఫోన్‌లో సంప్రదించారు. పిల్లలను ఆదుకునేందుకు తామున్నామంటూ ముందుకొచ్చారు. తమ సమాచారం చెప్పేందుకు ఇష్టంలేని ఎంతో మంది నేరుగా వైష్ణవి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. ఆర్‌డీటీ సంస్థ తరపున ఆ మండల ఏటీఎల్ రాధ అక్కడికి చేరుకొని ఆ ముగ్గురు పిల్లలను వారు కోరుకున్న చోట చదివించడానికి ఆర్‌డీటీ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకు ఆ పిల్లలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వేసవి సెలవుల అనంతరం తాము ఆర్‌డీటీ సంస్థ సహకారంతోనే చదువుకుంటామని తెలిపారు.
చిన్నారుల వివరాలు సేకరిస్తున్న తలుపుల తహసీల్దార్ శివయ్య, ఆర్‌డీటీ సిబ్బంది
♦ వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ ప్రవాసాంధ్రులు సైతం పిల్లలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మిత్రులంతా కలిసి పెద్ద మొత్తంలో నగదు పోగుచేసి వైష్ణవి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.
♦ బెంగళూరుకు చెందిన శ్రీధరి అనే మహిళ ఆ పిల్లలకు ప్రతి నెలా రూ.500 చొప్పున సాయం అందించేందుకు ముందుకొచ్చారు.
♦ లక్ష్మీపతి అనే ఆర్మీ ఉద్యోగి ఆ పిల్లలకు రూ.5 వేలు సాయం ‘సాక్షి’లో కనబరచిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తానన్నారు.
♦ కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రూ.1.10 లక్షల ఆర్థిక సాయం ఆ పార్టీ తలుపుల మండల నాయకుడు ఎద్దుల రాముడు ద్వారా అందించారు.
♦ కొత్తచెరువుకు చెందిన వెంకీ హీరో షోరూం యజమాని వెంకటేష్ రూ.5వేల నగదు జమచేశారు.
♦ కళ్యాణదుర్గంకు చెందిన రైతు పైనేటి శ్రీనివాస చౌదరి రూ.5 వేలు జమచేశారు. మరో రూ.5 వేలు రేపో, మాపో జమచేస్తానన్నారు.
♦ తలుపులకు చెందిన బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొత్తపల్లి రాంప్రసాద్‌రెడ్డి వైష్ణవి బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేశారు.
♦ మైసూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బడబాగ్ని జగదీశ్వర రాజు వైష్ణవి బ్యాంకు ఖాతాలో రూ.10వేలు జమ చేశారు.
♦ అనంతపురంకు చెందిన శ్రీకాంత్ రెడ్డి రూ.3వేలు నగదు వేశారు.