మూడోరోజు ఉస్సూరు..ఎగరని బెలూన్స్‌

నిలిచిన బెలూన్‌ ఫెస్టివల్‌

సహకరించని వాతావరణం.. ఎగరని బెలూన్లు

13 దేశాల బెలూనిస్ట్‌లకు నిరాశ

పర్యాటకులదీ అదే పరిస్థితి

సాక్షి, అరకులోయ : పర్యాటక ప్రాంతం అరకులోయలో జరుగుతున్న అంతర్జాతీయ బెలూన్‌ ఫెస్టివల్‌ మూడోరోజు కూడా వాతావరణం సహకరించకపోవడంతో ఒక్క బెలూన్‌ కూడా ఎగరలేదు. 13 దేశాలకు చెందిన 16మంది బెలూనిస్ట్‌లు, వారి స్నేహితులంతా స్థానిక ఎన్టీఆర్‌ మైదానానికి గురువారం ఉదయం 7 గంటలకే చేరుకున్నారు. అయితే అప్పటికే ఆకాశ«మంతా మబ్బులు కమ్ముకోవడంతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఇవాళ కూడా పర్యాటకులు నిరాశగా
వెనుదిరిగారు

కాగా నిన్న కూడా (బుధవారం) ప్రతికూల వాతావరణంతో బెలూన్‌లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో చాలా సమయం నిరీక్షించారు. దీంతో బెలూన్‌ ఫెస్టివల్‌ను సాయంత్రానికి వాయిదా వేసారు. బెలూన్‌ ఫెస్టివల్‌ రెండో రోజు రద్దవ్వడంతో వీదేశీయులంతా నిరాశ చెందారు. మైదానంలో ఉదయం 9 గంటల వరకు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో వారంతా ఉసూరుమన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి కూడా వాతావరణంలో మార్పు రాలేదు. దీంతో రెండో రోజు బెలూన్‌ల రైడింగ్‌ను పూర్తిగా రద్దు చేశారు. బెలూన్‌ల వాహనాలకు వర్షం నుంచి రక్షణకు ప్లాస్టిక్‌ కవర్లు కప్పారు.

విదేశీయులు, పర్యాటకులకు నిరాశ
అంతర్జాతీయ బెలూన్‌ ఫెస్టివల్‌ తొలిసారిగా అరకులోయలో జరగడంతో ప్రాధాన్యత నెలకొంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తొలిరోజు బెలూన్‌ల రైడింగ్‌ పూర్తిస్థాయిలో జరగలేదు. మంగళవారం అయినా బెలూన్‌ ఫెస్టివల్‌ బాగా జరుగుతుందని 13 దేశాల రైడిస్ట్‌లు, పర్యాటకులు ఆశపడ్డారు. అయితే రెండో రోజు కూడా ప్రతికూల వాతావరణంతో బెలూన్‌ల రైడింగ్‌ సాయంత్రం వరకు జరగకపోవడంతో ఫెస్టివల్‌ ఆశయానికి తూట్లు ఏర్పడ్డాయి.

మూడు రోజుల నుంచి బెలూన్‌ల రైడింగ్‌తో హల్‌చల్‌ చేద్దామని వీదేశీయులు, ఈ రైడింగ్‌ను కనులారా చూద్దామని పర్యాటకులు ఎంతో ఆశపడ్డారు. అయితే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. బుధవారం ఉదయాన్నే ఎన్టీఆర్‌ మైదానానికి చేరుకున్న పర్యాటకుల సంఖ్య తక్కువగానే ఉంది. స్థానిక అరకు పట్టణ ప్రజలు కూడా పట్టించుకోలేదు. అయితే ఉన్నపాటి పర్యాటకులు కూడా బెలూన్‌ రైడింగ్‌ లేకపోవడంతో నిరాశ చెందారు. 16మంది విదేశీయులతో సెల్ఫీలు దిగడం మినహా బెలూన్‌ ఫెస్టివల్‌కు మరే విశేషం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top