సమైక్య ఉద్యమం మరింత ఉద్ధృతం | High Intensity of State United Movement in srikakulam | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమం మరింత ఉద్ధృతం

Sep 29 2013 4:23 AM | Updated on Sep 2 2018 4:46 PM

జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. బంద్ కారణంగా వ్యాపార సంస్థలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు,

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. బంద్ కారణంగా వ్యాపార సంస్థలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. వాహనాలు తిరగలేదు. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల  ఉద్యోగులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వీధిదీపాలను ఆర్పివేసి నిరసన తెలిపారు. నరసన్నపేట, పోలాకిల్లో ఐకేపీ సిబ్బంది, స్వయంశక్తి సంఘాల మహిళలు మానవహారం నిర్వహిం చారు. ఎచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాల యంలో ప్రొఫెసర్ల, జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రణస్థలంలో రణభేరి కార్యక్రమం విజయవంతమైంది.
 
శ్రీకాకుళంలో సమైక్యవాదులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి దుకాణాలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు తెరవకుండా, వాహనాలు నడవకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటోలను నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. బంద్ కారణంగా రహదారులన్నీ  నిర్మానుష్యంగా మారాయి. పొట్టిశ్రీరాములు జంక్షన్ వద్ద సమైక్యాంధ్ర జేఏసీ సభ్యులు నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్ కూడలిలో మ్యాజిక్ షో నిర్వహించారు.  ఆంజనేయస్వామి ఆలయం వద్ద డీఎంహెచ్‌వో ఉద్యోగులు 101 కొబ్బరికాయలు కొట్టారు.
 
పాలకొండలో భవన నిర్మాణ కార్మికులు మహా ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వేదిక వద్ద డివిజన్ విద్యార్థి జేఏసీ ప్రతినిధులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పాలకొండలో బంద్ విజయవంతమైంది. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్ద సి.ఎల్.నాయుడు పాఠశాల ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. వీరఘట్టంలో ఆర్‌సీఎం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. తలపై బిందెలు పెట్టుకొని నిరసన తెలిపారు. సీతంపేటలో బంద్ విజయవంతమైంది. ఇక్కడ చిన్నారులు చిన్న సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. భామిని మండలం నేరడి-బిలో ఉద్యమకారులు జలాభిషేకం నిర్వహించారు. బాలేరులో వృద్ధులు ఆందోళనలో పాల్గొన్నారు.
 
నరసన్నపేటలో ఉద్యమకారులు చేపట్టిన 72, 78 గంటల నిరాహార దీక్షలు ముగిశాయి. సమైక్యవాదులు కేంద్రప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. జలుమూరులో స్వయంశక్తి సంఘాల మహిళలు, పీఏసీఎస్ ప్రతినిధి రిలే దీక్షలో పాల్గొన్నారు. తిలారు జంక్షన్ వద్ద పలు విద్యా సంస్థల వారు మానవహారం నిర్వహించారు. పోలాకి మండలంలో స్వయంశక్తి సంఘాల సభ్యులు రిలే దీక్షలో పాల్గొన్నారు. సారవకోటలో పలువురు నాయకుల మాస్క్‌లతో సోనియా గాంధీకి భజన చేశారు. సమైక్య ఉద్యమం ప్రారంభమై 60 రోజులు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు 60 ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. పలాసలో ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 38వ రోజుకు,
 
టీడీపీ రిలే దీక్షలు 34వ రోజుకు, ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు 26వ రోజుకు, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 54వ రోజుకు చేరాయి. దళిత సంఘాల రిలే దీక్షలు 3వ రోజుకు చేరాయి. టెక్కలిపట్నంలో రిలే దీక్షలు 28వ రోజుకు, మందసలో రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. బంటుకొత్తూరులో గ్రామస్తులు వంటావార్పు చేసి నిరసన తెలిపారు.వజ్రపుకొత్తూరు, చినకొత్తూరు, కిడిసింగి, అక్కుపల్లి, చినవంక, కొండవూరు, మంచినీళ్లపేటల్లో ర్యాలీలు నిర్వహించారు. అంబుగాం గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
 
ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, కుశాలపురం జంక్షన్ వద్ద ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.  రాజాంలో దేవాంగ కులస్తులు దేవాంగ గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డుపై రాట్నం వడికి చీరలు నేశారు. అరగంటసేపు ట్రాఫిక్‌ను స్థంబింపజేశారు. వివిధ వేషధారణలతో నిరసన గళాన్ని వినిపించారు. ఇచ్ఛాపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో వేర్వేరుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.  ఆమదాలవలసలో శిష్టకరణాలు ర్యాలీ, మానవహారం చేపట్టారు. పట్టణ జేఏసీ ప్రతినిధులు ధర్నా చేశారు. సరుబుజ్జిలిలో ఉపాధ్యాయులు కవిసమ్మేళనం నిర్వహించారు.
 
టెక్కలి జేఏసీ శిబిరంలో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. దుర్గా మల్లేశ్వర భజన బృందం సభ్యులు సమైక్య గీతాలను ఆలపించారు. ప్రజా చైతన్య కళా సమితి సభ్యుడు రమణారావు హరికథా గానం చేశారు. సంతబొమ్మాళి మండలం గొదలాంలో గ్రామస్తులు ర్యాలీ చేశారు. వీరాంజనేయ వ్యాయామ మండలి సభ్యులు రోడ్డుపైనే వెయిట్ లిప్టింగ్ పోటీలు నిర్వహించి నిరసన తెలిపారు. కోటబొమ్మాళిలో ఎన్‌జీవో, పాత్రికేయ, జేఏసీ ప్రతినిధులు ర్యాలీ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement