
మూలమూలనా మహమ్మారే
రాష్ట్రంలో మూలమూలలా, వాడవాడలా మద్యం మహమ్మారి వేళ్లూనుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలంటూ వ్యంగ్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మద్యం మార్కెటింగ్‌లో ప్రభుత్వం దూసుకెళ్తోంది: హైకోర్టు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూలమూలలా, వాడవాడలా మద్యం మహమ్మారి వేళ్లూనుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలంటూ వ్యంగ్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మద్యం విధానాలకు సంబంధించి బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందంటూ మండిపడింది. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఉదంతానికి ప్రభుత్వాన్నే బాధ్యు రాలిని చేసింది. తల్లిని కోల్పోయిన బాధిత చిన్నారుల కు ఒక్కొక్కరి పేరుపై రూ. 2 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యానికి బానిసైన వరంగల్ జిల్లా అర్పణపల్లి నివాసి ఘనపురపు రవి... భార్యను కిరాతకంగా హింసించి, కిరోసిన్ పోసి తగులపెట్టాడు. ఈ ఘాతుకాన్ని కళ్లారా చూసిన వారి ఆరేళ్ల కుమారుడు కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసును విచారించిన వరంగల్ ఆరో అదనపు సెషన్స్ జడ్జి గోవర్దన్‌రెడ్డి.. రవికి జీవితఖైదు విధిస్తూ 2008లో తీర్పు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ రవి హైకోర్టు లో దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న తర్వాత రవి అప్పీల్‌ను కొట్టివేసింది. తండ్రి ఘాతుకానికి తల్లిని కోల్పోయిన మైనర్లకు ఒక్కొక్కరి పేరు మీద మూడు నెలల్లోగా రూ.2 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
‘‘దురదృష్టవశాత్తూ ఓ యువకుడు తన భవిష్యత్తును పణంగా పెట్టి మద్యానికి బానిసయ్యాడు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా మద్యం దొరికేలా ప్రభుత్వం దూసుకుపోయే మార్కెట్ శైలిని అనుసరిస్తోంది. ఇందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇటువంటి అంశాలకు సంబంధించే అత్యధిక స్థాయిలో అప్పీళ్లు దాఖలవుతుండటం ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తోంది. మద్యానికి బానిసై యువకులు జీవితాలను నాశనం చేసుకుంటుంటే, దాని ఫలితాన్ని అమాయక మహిళలు అనుభవించాల్సి వస్తోంది. మద్యం మాటున వారి జీవితాలు దారుణంగా బలవుతున్నాయి. ప్రభుత్వ బాధ్యతా రహిత విధానాలతో కుటుంబాలను విచ్
ఛిన్నం చేస్తోంది. ముఖ్యంగా సమాజంలోని బలహీనవర్గాలు మద్యం వల్ల నష్టపోతున్నాయి. దీనిపై ఎప్పటికిప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాం. బాధ్యతా రహిత, సంఘ వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంద’’ని ఘాటుగా వ్యాఖ్యానించింది.