liquor marketing
-
దేశీ మద్యం గుబాళింపులు
ప్రపంచంలో విస్కీని అత్యధికంగా వాడేది భారత్‌లోనే. విశ్వవ్యాప్తంగా తయారయ్యే వీస్కీలో దాదాపు సగం మన దేశంలోనే ఖర్చయిపోతోంది. విస్కీ, రమ్, జిన్, ఓడ్కా, బ్రాండీ... ఇలా అన్ని రకాలూ కలిపి భారత్‌లో మద్యం మార్కెట్ విలువ ఏకంగా రూ.4.59 లక్షల కోట్లకు చేరింది. మరో మూడేళ్లలో రూ.5.59 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇంతటి భారీ మార్కెట్లో దేశవాళీ మద్యం కూడా తన హవా కొనసాగిస్తోంది. విదేశీ మూలాలున్న విస్కీ, బ్రాండీ, ఓడ్కా లాంటి వాటితో పోలిస్తే స్థానిక రకాలను ప్రేమించే మద్యం ప్రియులు ఎక్కువైపోయారు. వారి అభిరుచికి తగ్గట్లు స్థానిక రకాలకూ స్థానం కల్పించడం బార్లలో ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ ధోరణి నానాటికీ పెరుగుతోందనేందుకు పెరిగిన దేశవాళీ సరకు అమ్మకాలే నిదర్శనం.టోంగ్బా.. జుడియా సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లలో టోంగ్బా అనే స్థానిక మద్యం మద్యపాన ప్రియులకు మహా ఇష్టం. అస్సాంలో జుడియా, మణిపూర్‌లో సేక్మాయ్ యూ... ఇలా స్థానిక రుచులకు జనం నానాటికీ ఫిదా అవుతున్నారు. ఇక గోవాలో ఫెనీ చాలా ఫేమస్. ఈ స్థానిక మద్యాన్ని పులియబెట్టిన జీడిపప్పుల నుంచి తయారుచేస్తారు. గోవాలో ఏ మూలన చూసినా, ఏ బార్లో చూసినా విదేశీ మద్యంతో పాటు ఫెనీ కూడా అమ్ముతారు. పలు రాష్ట్రాల నుంచి వచి్చన పర్యాటకులతోపాటు విదేశీ సందర్శకులు కూడా దీన్ని టేస్ట్ చేయకుండా వదిలిపెట్టరు. అందుకే ఇప్పుడక్కడ దీని విక్రయాలు గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ‘‘పోర్చుగీస్ మూలాలున్న ఫెనీకి స్థానిక రుచిని కలపడంతో గోవా సంస్కృతిలో భాగంగా మారింది’’ అని మిస్టర్ బార్ట్రెండర్గా ఇన్‌స్టాలో ఫేమస్ అయిన కాక్టేల్ నిపుణుడు నితిన్ తివారీ చెప్పారు. దేశవ్యాప్తంగా మారిన టేస్ట్శతాబ్దాల చరిత్ర ఉన్న స్థానిక మద్యం రకాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో అవి బార్లలోనూ అందుబాటులోకి వస్తున్నట్టు తులీహో సీఈఓ, 30బెస్ట్బార్స్ ఇండియా, ఇండియా బార్టెండర్ వీక్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆచంట చెప్పారు. ఈ ట్రెండ్ గతేడాది నుంచి మొదలైందని నెట్‌ఫ్లిక్స్ మిడ్నైడ్ ఆసియా కన్సల్టెంట్, ప్రముఖ కాక్టేల్ నిపుణుడు అమీ ష్రాఫ్ వెల్లడించారు. ‘‘స్థానిక మద్యానికి జై కొట్టడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో యువత చేస్తున్న ప్రచారమే. హిమాచల్‌లో ధాన్యం, గింజలను ఉడకబెట్టి తయారుచేసే రైస్ వైన్ వంటి స్థానిక రకాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది’’ అని పీసీఓ, ఢిల్లీ జనరల్ మేనేజర్ వికాస్ కుమార్ చెప్పారు. ‘‘ఇదేదో గాలివాటం మార్పు కాదు. పక్కాగా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. దేశవాళీ మద్యానికి గుర్తింపు తేవాలని ఇక్కడి కంపెనీలు నడుం బిగించాయి’’ అని డియాజియో ఇండియా చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ విక్రమ్ దామోదరన్ అన్నారు. విలాస వస్తువుగా..‘‘ఇండియా అగావే, ఫెనీ, మహువా వంటి స్థానిక మద్యం ఆయా ప్రాంతాల్లో మాత్రమే లభిస్తోంది. ఆ రకం కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. అయినా సరే, రానుపోను ఖర్చులు, బస, ఇతరత్రా ఖర్చులను కూడా లెక్కచేయకుండా ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లి మద్యం సేవించి రావడం ట్రెండ్‌గా మారింది. దీంతో స్థానికేతరులకు స్థానిక మద్యం కూడా విలాస వస్తువుగా మారుతోంది’’ అని మాయా పిస్టోలా అగావెపురా మద్యం సంస్థ మహిళా సీఈఓ కింబర్లీ పెరీరా చెప్పారు. ‘మహువా రకం మద్యం బ్రిటన్‌కు భారత్ వలసరాజ్యంగా మారకముందు చాలా ఫేమస్. తర్వాత మరుగున పడింది. ఇప్పుడు కొందరు దాంట్లో పలు రుచులు తెస్తున్నారు. వాటిని కాక్టేల్ నిపుణులు మరింత మెరుగుపరుస్తున్నారు. సిక్స్ బ్రదర్స్ మహువా పేరుతో దేశంలోనే తొలిసారిగా లగ్జరీ మహువా మద్యం తెస్తున్నాం’’ అని సౌత్ సీస్ డిస్టిలరీస్ డైరెక్టర్ రూపీ చినోయ్ చెప్పారు. అయితే, ‘‘స్థానిక మద్యం మొత్తానికీ వర్తించే సింగిల్ బ్రాండ్ అంటూ ఇప్పటికైతే ఏమీ లేదు. ఈ సమస్య పరిష్కారమైతే లైసెన్సింగ్ సమస్యలు తీరతాయి. అప్పుడు దేశవాళీ మద్యం అమ్మకాలు, నాణ్యత పెరుగుతాయి’’ అని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్రమాల టై‘టానిక్’
సాక్షి, హైదరాబాద్: ఎలైట్ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్ బిజినెస్) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్ పెట్టి ఇంకెవరూ ఎలైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్’ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలైట్ స్టోర్ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్బీసీఎల్కూ ఆయనే బాస్ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్ నడిపించిందని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారంటే టానిక్ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎలైట్ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్ బాటిళ్లు ఎప్పుడూ డిస్ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి. చైన్ బిజినెస్ స్థాయికి ప్రణాళిక.. ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్ అడిగిందే తడవుగా ఎక్సై జ్ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది. క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది. అచ్చం మాతృ టానిక్ షాపులాగానే ఎలైట్గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్ చైన్షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్ చైన్షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్ సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్), వాకిన్ స్టోర్లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్ ఎలైట్ వాకిన్ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది. -
ఈ ఏడాది మూడుసార్లు పెరిగిన మద్యం ధరలు.. అసలే దసరా కావడంతో
సాక్షి, హైదరాబాద్: మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీలు ఎత్తులు వేస్తున్నాయి. పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని చీప్ లిక్కర్ కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టు ఎక్సైజ్ శాఖ ఏకంగా మద్యం దిగుమతులకు సిద్ధమవుతోంది. అయినా ఇప్పటికే బహిరంగ మార్కెట్లో చీప్ లిక్కర్‌కు స్వల్ప కొరత ఏర్పడింది. డిస్టలరీలు తయారీ నిలిపివేయడంతో పాపులర్ బ్రాండ్ చీప్ లిక్కర్ మార్కెట్లో దొరకడం లేదు. ధర ఎక్కువ ఉన్న బ్రాండ్లే మందు ప్రియులకు దిక్కయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ నాటికి అసలు మందు దొరికే పరిస్థితి ఉండదనే వదంతులు కూడా ఎక్సైజ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? కరోనా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో మూడుసార్లు మద్యం ధరలు పెరిగాయి. కానీ మద్యం తయారు చేసినందుకు గాను డిస్టలరీలకు చెల్లించే ప్రాథమిక ధర (లిక్కర్ కేస్‌కు చెల్లించే బేసిక్ ప్రైస్)ను మాత్రం ప్రభుత్వం పెంచలేదు. దీంతో పెరిగిన ధరల మేరకు ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకు వెళుతోంది. ఈ నేపథ్యంలో బేసిక్ ప్రైస్ పెంపు కోసం డిస్టలరీలు ప్రయత్నించాయి. ఈఎన్ఏ కొరత అంటూ.. రాష్ట్రంలో ప్రతిరోజూ లక్ష కేసుల వరకు మద్యం అమ్ముడవుతుంది. ఈ లక్ష కేసుల మద్యాన్ని తయారు చేసేందుకు గాను 4 లక్షల లీటర్ల ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) అవసరమవుతుంది. ఈ ఈఎన్ఏ తయారీ కోసం రాష్ట్రంలో 8 ప్రైమరీ డిస్టలరీలున్నాయి. ఈ డిస్టలరీల్లో రెక్టిఫైడ్ స్పిరిట్, ఇథనాల్‌తో పాటు ఈఎన్ఏ కూడా తయారవుతుంది. ఇందులో స్పిరిట్, ఇథనాల్‌ను ఇండ్రస్టియల్ ఆల్కహాల్‌గా పరిగణిస్తారు. ఈఎన్‌ఏతో సెకండరీ డిస్టలరీలు మద్యం తయారు చేస్తాయి. అయితే ఈఎన్ఏ తయారు చేయడం కోసం ప్రైమరీ డిస్టలరీలకు ఆహార ధాన్యాలు (గోధుమలు, బియ్యం), మొలాసిస్ అవసరం. తెలంగాణలోని డిస్టలరీల్లో నూక బియ్యాన్ని మాత్రమే ఉపయోగించి ఈఎన్ఏ తయారు చేస్తారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్) వ్యవహారంలో మిల్లులపై ఎఫ్‌సీఐ దాడులు చేయడంతో నూక బియ్యం సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం నాలుగు డిస్టలరీలే ఈఎన్ఏను పూర్తిస్థాయిలో తయారు చేస్తున్నాయి. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని డిస్టలరీలు ఎత్తు వేశాయి. మద్యం తయారుచేసే ఈఎన్ఏ (ముడిసరుకు) ధర పెరిగిందని, అసలు ముడిసరుకు దొరకడం లేదని, నాలుగు డిస్టలరీల్లో తయారవుతున్న ఈఎన్ఏ.. ప్రీమియం బ్రాండ్ల తయారీకి అవసరమవుతుందంటూ చీప్ లిక్కర్ తయారీని డిస్టలరీలు నిలిపివేశాయి. బేసిక్ ప్రైస్ పెంచాలని ప్రతిపాదించాయి. ఎక్సైజ్ పరిశీలనలో గుట్టు రట్టు డిస్టలరీల ప్రతిపాదనను ఎక్సైజ్ శాఖ నిశితంగా పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. అసలు ఈఎన్ఏ కొరతే లేదని, అవసరాల మేరకు ఈఎన్ఏ అందుబాటులో ఉందని తేలింది. రోజుకు 4 లక్షల లీటర్ల ఈఎన్ఏ అవసరం కాగా, డిస్టలరీల్లో 10 రోజులకు సరిపడా (అంటే 40 లక్షల లీటర్లు) స్టాక్ ఉందని గుర్తించింది. పూర్తి స్థాయిలో పనిచేస్తున్న నాలుగు ప్రైమరీ డిస్టలరీల నుంచే రోజుకు 3.5 లక్షల లీటర్ల ఈఎన్ఏ ఉత్పత్తి అవుతోందని తేలింది. అయినప్పటికీ ఒకవేళ సరిపోని పక్షంలో ముడిసరుకును మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాలని, ఇందుకు గాను ప్రతి లీటర్‌పై ఉన్న రూ.4 సుంకాన్ని ఎత్తివేస్తామని ప్రతిపాదించింది. అవసరమైతే చీప్ లిక్కర్‌ను కూడా దిగుమతి చేసుకోవాలని, ఇందుకోసం ప్రతి కేస్‌పై వసూలు చేసే ఆరు రూపాయల సుంకాన్ని కూడా ఎత్తివేస్తామని ప్రతిపాదించింది. అదే సమయంలో డిస్టలరీలు కోరుతున్న విధంగా బేసిక్ ప్రైస్ పెంచేందుకు శాఖాపరమైన కమిటీని నియమించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
మద్యం మార్కెటింగ్‌లో ప్రభుత్వం దూసుకెళ్తోంది
-
మూలమూలనా మహమ్మారే
మద్యం మార్కెటింగ్‌లో ప్రభుత్వం దూసుకెళ్తోంది: హైకోర్టు మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూలమూలలా, వాడవాడలా మద్యం మహమ్మారి వేళ్లూనుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలంటూ వ్యంగ్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మద్యం విధానాలకు సంబంధించి బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందంటూ మండిపడింది. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఉదంతానికి ప్రభుత్వాన్నే బాధ్యు రాలిని చేసింది. తల్లిని కోల్పోయిన బాధిత చిన్నారుల కు ఒక్కొక్కరి పేరుపై రూ. 2 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యానికి బానిసైన వరంగల్ జిల్లా అర్పణపల్లి నివాసి ఘనపురపు రవి... భార్యను కిరాతకంగా హింసించి, కిరోసిన్ పోసి తగులపెట్టాడు. ఈ ఘాతుకాన్ని కళ్లారా చూసిన వారి ఆరేళ్ల కుమారుడు కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసును విచారించిన వరంగల్ ఆరో అదనపు సెషన్స్ జడ్జి గోవర్దన్‌రెడ్డి.. రవికి జీవితఖైదు విధిస్తూ 2008లో తీర్పు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ రవి హైకోర్టు లో దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న తర్వాత రవి అప్పీల్‌ను కొట్టివేసింది. తండ్రి ఘాతుకానికి తల్లిని కోల్పోయిన మైనర్లకు ఒక్కొక్కరి పేరు మీద మూడు నెలల్లోగా రూ.2 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘దురదృష్టవశాత్తూ ఓ యువకుడు తన భవిష్యత్తును పణంగా పెట్టి మద్యానికి బానిసయ్యాడు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా మద్యం దొరికేలా ప్రభుత్వం దూసుకుపోయే మార్కెట్ శైలిని అనుసరిస్తోంది. ఇందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇటువంటి అంశాలకు సంబంధించే అత్యధిక స్థాయిలో అప్పీళ్లు దాఖలవుతుండటం ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తోంది. మద్యానికి బానిసై యువకులు జీవితాలను నాశనం చేసుకుంటుంటే, దాని ఫలితాన్ని అమాయక మహిళలు అనుభవించాల్సి వస్తోంది. మద్యం మాటున వారి జీవితాలు దారుణంగా బలవుతున్నాయి. ప్రభుత్వ బాధ్యతా రహిత విధానాలతో కుటుంబాలను విచ్ ఛిన్నం చేస్తోంది. ముఖ్యంగా సమాజంలోని బలహీనవర్గాలు మద్యం వల్ల నష్టపోతున్నాయి. దీనిపై ఎప్పటికిప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాం. బాధ్యతా రహిత, సంఘ వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంద’’ని ఘాటుగా వ్యాఖ్యానించింది.