కీలక సమయంలో వరుణుడు కరుణించాడు. భారీ వర్షంతో ఎండుతున్న పైర్లకు ప్రాణం పోశాడు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కీలక సమయంలో వరుణుడు కరుణించాడు. భారీ వర్షంతో ఎండుతున్న పైర్లకు ప్రాణం పోశాడు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు సాంత్వన చెందారు. పంటలపై ఆశలు వదులుకొని దిగాలుగా ఉన్న అన్నదాతల మోముల్లో ఆనందం నింపాడు.
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంతో పూర్తిగా ఎండిపోయిన మొక్కజొన్న మినహా మిగిలినవి జీవం పోసుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చాలా చోట్ల పడిన వాన పడినట్టే భూమిలోకి ఇంకిపోయింది. జిల్లాలో శ్రీశైలంలో అత్యల్పంగా 4.2 మి.మీ., అత్యధికంగా బేతంచెర్లలో 120.6 మి.మీ వర్షపాతం నమోదైంది.
32 మండలాల్లో 50 మి.మీ.కు పైగా వర్షం కురవగా.. జిల్లా వ్యాప్తంగా 56.2 మి.మీ.కు పైగా వర్షపాతం నమోదయింది. అయితే వర్షాలు ఇంకా అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా, ఇప్పటి వరకు 94.1 మి.మీ. నమోదయింది. ప్రస్తుతం కురిసిన వర్షాలతో పైర్లు కోలుకున్నా.. దిగుబడులు ఆశాజనకంగా ఉండవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇదిలా ఉండగా ఆదివారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షంతో పలువురు నష్టాల పాలయ్యారు. వాగులు, వంకలు పొంగిపొర్లి పంట పొలాలను ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. కుంటలు, చెక్‌డ్యామ్‌లు వాన నీటితో కళకళలాడుతున్నాయి. ఓర్వకల్లు మండలం సోమయాజుపల్లె చెరువుకు గండి పడటంతో వందల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతినింది.
ఓర్వకల్లు సమీపంలోని కుందువాగు పొంగిపొర్లడంతో 18వ జాతీయరహదారిపై సుమారు 3 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మట్టిమిద్దె కూలడంతో డోన్ మండలం పెద్దమల్కాపురానికి చెందిన పదో తరగతి విద్యార్థిని హేమలత(15) మృతి చెందింది. పిడుగుపాటుకు కృష్ణగిరి మండలం గుడెంపాడుకు చెందిన మహేశ్వరరెడ్డి (40) గాయాలపాలయ్యాడు. పిడుగుపడడంతో మహానందిలోని కోదండరామాలయం గోపురం స్వల్పంగా దెబ్బతింది. వాగులు వంకలు పొంగిపొర్లటంతో కోవెలకుంట్ల ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎమ్మిగనూరు, గోనెగండ్ల, పత్తికొండ, ఓర్వకల్లు, గూడూరు, కృష్ణగిరి మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో పత్తి, ప్రొద్దుతిరుగుడు, ఉల్లి, మిరప తదితర పంటలు నీట మునిగాయి. గూడూరు మండలం కొత్తబస్టాండ్ చెరువు పొంగిపొర్లి ప్రవహించటంతో సంజీవయ్యనగర్ కాలనీ నీటమునిగింది. స్పందించిన స్థానికులు, అధికారులు చెరువుకు గండికొట్టారు. ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ తరహాలో వర్షం పడటం ఇదే మొదటిసారి.