ఒనగూరేదెంత..? | heavy rains damaged crops, the central team to examine parts of the district on Tuesday | Sakshi
Sakshi News home page

ఒనగూరేదెంత..?

Nov 19 2013 2:43 AM | Updated on Sep 2 2017 12:44 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించనుంది.

 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ :  ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు  కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించనుంది. వారం రోజులకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా అన్నదాతల ఆరుగాలం శ్రమ, అప్పులు చేసిన పెట్టిన మదుపులు మట్టికొట్టుకుపోయాయి. ఆదుకోవలసిన అధికారులు అంచనాలు రూపొందించడంలో వంచన చేశారు. దీంతో కేంద్ర బృందంపైనే  రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు.  ఈ తరుణంలో కేంద్రం బృందం జిల్లా పర్యటన ఖరారైంది. అయితే ఆ బృందం పర్యటన షెడ్యూల్, పర్యటించే సమయం వివరాలు తెలుసుకున్న రైతులు మళ్లీ అవాక్కయ్యారు. ఈ బృంద సభ్యుల రాక కోసం ఎంతో ఆత్రుతగా వేచిచూస్తున్న అన్నదాతకు నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది.
 
   భారీ వర్షాల వల్ల అన్ని మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లగా  ఇప్పుడొస్తున్న కేంద్ర బృందం  కేవలం రెండు మండలాల్లోనే పర్యటించనుంది. అది కూడా గంటా 45 నిమిషాల సమయంలో ఈ పర్యటన పూర్తవుతుంది. ఈ సమయంలోనే మొదట భోగాపురం మండలం, తరువాత జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న  చీపురుపల్లి మండలాల్లో పర్యటించనుంది. అయితే ఈ పర్యటన షెడ్యూల్ అంతా రాజకీయ కోణంలో రూపొందించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా మంత్రి బొత్స రాజకీయం కోసమే సొంతనియోజకవర్గంలో కేంద్ర బృంద పర్యటన షెడ్యూల్‌ను ఏర్పాటు చేసినట్లు విమర్శలువస్తున్నాయి.  దీంతో జిల్లాకు కేంద్ర బృందం వచ్చినప్పటికీ  ఎంత వరకు వారు నష్టం అంచనాలు కచ్చితంగా వేస్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.  
 
 పర్యటన సాగేదిలా..
 కేంద్ర బృందం మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ చేరుకుంటుంది. అక్కడ పాడైన ఆర్‌అండ్‌బీ రోడ్డును పరిశీలించి, ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది. 2.50 నిమిషాలకు భోగాపురం చేరుకుని పెద్ద చెరువు గండిని పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి సంభాషిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు చీపురుపల్లి మండలం గొల్లల ములగాం చేరుకుని 200 ఎకరాల్లో నష్టపోయిన పత్తిపంటను పరిశీలిస్తుంది. అక్కడ ఏర్పాటు చేసే  ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది.  4.10 నిమిషాలకు అదే మండలం కరకాం గ్రామంలో 25 ఎకరాల్లో పాడైన బొప్పాయి పంటను పరిశీలిస్తుంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే 4.15 నిమిషాలకు  అక్కడ నుంచి బయలుదేరి రణస్థలం మీదుగా శ్రీకాకుళం జిల్లా పరిశీలనకు వెళుతుంది.
 
 వినతులిచ్చేందుకు అవకాశం
 భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు తమ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో బృంద సభ్యులకు వినతులు సమర్పించేందుకు   కలెక్టర్ కాంతిలాల్‌దండే అవకాశం కల్పించారు. అయితే వినతుల సమర్పణలో ప్రశాంతత పాటించాలని, పరిశీలనకు ఆటంకం కలిగించరాదని కలెక్టర్ సూచించారు. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా జిల్లాలో సంభవించిన నష్టాన్ని పూర్తి స్థాయిలో బృందానికి వివరించడంలో అధికారులు      విఫలం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement