అల్పపీడనం.. అధిక వర్షం 

Heavy Rain Fall In West Godavari District - Sakshi

సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షానికి పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలకు పలు చోట్ల నారుమళ్లు, వరినాట్లు నీట మునిగాయి. దీనికి శుక్రవారం కురిసిన వర్షం తోడు కావడంతో ముంపు తీవ్రత మరింత పెరిగింది. పలుచోట్ల చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి.

భీమవరం, ఉండి ప్రాంతాల్లో 6 స్తంభాలు నేలకూలాయి. యలమంచిలి మండలంలో చించినాడ కాలువకు గండిపడింది. దీంతో పలుచోట్ల నారుమళ్లు, వరినాట్లు నీటమునిగాయి. పాలకొల్లు మండలంలోను పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం యలమంచిలి, పాలకొల్లు. పోడూరు, తణుకు, పెనుమంట్ర, అత్తిలి, పెనుగొండ, పెరవలి, పాలకోడేరు, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు, వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకులాయి. జిల్లా వ్యాప్తంగా  చెట్ల కొమ్మలు విరిగిపడడంతో 16 ఫీడర్లలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడం తదితర కారణాల వల్ల విద్యుత్‌ శాఖకు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లింది.   

నారుమళ్లు, నాట్లకు తీరని నష్టం 
భారీ వర్షాల వల్ల నారుమళ్లకు తీరని నష్టం కలిగింది.  నాట్లు వేసిన వరిపొలాలూ దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం..  4,818 హెక్టార్లలో వరినాట్లు, 430 హెక్టార్లలో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి.   

రికార్డు స్థాయిలో వర్షం.. 
జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఏకంగా 32.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే గరిష్ట వర్షపాతం. గత రెండు నెలలుగా వర్షాలు లేవు. జూన్‌ నెలలో అయితే లోటు వర్షపాతం నమోదైంది.  యలమంచిలి మండలంలో రికార్డుస్థాయిలో 97.6 మిల్లీమీటర్లు పోడూరులో 90.0, పాలకొల్లులో 78.4, తణుకులో 71.0,పెనుమంట్రలో 60.2, అత్తిలిలో 59.8, పెనుగొండలో 58.6, పెరవలిలో 59.4, పాలకోడేరులో 55.6, ఆచంటలో 50.5 మిల్లీమీటర్లు చొప్పున  వర్షం కురిసింది. వీరవాసరంలో 46.8, నరసాపురంలో 45.4, భీమవరంలో 39.4, మొగల్తూరులో 38.6, నిడమర్రులో 38.2, గణపవరంలో 38.0, ఉండిలో 31.2, జంగారెడ్డిగూడెంలో 29.0, వేలేరుపాడులో 28.0.

టి.నరసాపురం లో 27.4, కుక్కునూరులో 27.2, పెంటపాడులో 26.4, కాళ్లలో 25.2, చాగల్లులో 22.6, తాళ్లపూడిలో 22.2, ఆకివీడులో 21.8, పెదవేగిలో 20.6, చింతలపూడి, తాడేపల్లిగూడెం మండలాల్లో 20.0, ఉంగుటూరులో 19.4, నిడదవోలులో 18.2, కొవ్వూరులో 17.4, భీమడోలులో 17.2, కొయల్యగూడెం లో 16.2, దేవరపల్లిలో 15.8,లింగపాలెం, కామవరపుకోటంలో 14.6, గోపాలపురంలో 12.6, దెందులూరులో12.2, ద్వారకాతిరుమలలో 12.0, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెంలలో 11.6, పెదపాడు,ఏలూరు మండలాల్లో 9.8 మిల్లీమీటర్లు చొప్పున, నల్లజర్లలో 6.2, పోలవరంలో 4.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top