'మైండు దొబ్బింది.. గాజులు కొట్టేశా' | Sakshi
Sakshi News home page

'మైండు దొబ్బింది.. గాజులు కొట్టేశా'

Published Sun, Feb 2 2020 9:04 AM

Head Nurse Robbed Bangles From Staff Nurse In Anantapur Hospital  - Sakshi

సాక్షి, అనంతపురం : ‘మైండు దొబ్బింది..బంగారు గాజులు కొట్టేశాను. అంతే తప్ప నాకింకేం తెలియదు అంటూ సర్వజనాస్పత్రిలో ఓ హెడ్‌నర్సు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే... గత నెల 26న ఆస్పత్రిలోని లేబర్‌ వార్డు ఉదయం పేషంట్‌కు సేవలందించిన తర్వాత చేతులు కడుక్కునే సమయంలో ఓ స్టాఫ్‌నర్సు గాజులను తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచింది. దీనిని గమనించిన హెడ్‌నర్సు గుట్టుచప్పుడు కాకుండా వాటిని కొట్టేసింది. కాసేపటికి స్టాఫ్‌నర్సు బ్యాగ్‌ను చెక్‌ చేసుకోగా అందులో గాజులు కన్పించలేదు. రూ.లక్ష విలువ చేసే బంగారు గాజులు పోయాయని కన్నీటి పర్యంతమైంది.

ఆదివారం కావడంతో సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సీసీ పుటేజ్‌ చూసేందుకు కూడా వీలు కాలేదు. ఆ మరుసటి రోజు విషయాన్ని నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంఓ దృష్టికి బాధితురాలు తీసుకెళ్లింది. సీసీ పుటేజ్‌ను పరిశీలించిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనిపై సూపరింటెండెంట్‌ రామస్వామి నాయక్‌ విచారణకు ఆదేశించడంతో ఆర్‌ఎంఓ, నర్సింగ్‌ సూపరింటెండెంట్ల సమక్షంలో సదరు హెడ్‌నర్సు నిజాన్ని ఒప్పుకుంది. ఎందుకు అలా చేశావని అడిగితే మైండు దొబ్బిందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీనిపై తదుపరి చర్యలు ఏం తీసుకుంటారోనని ఆస్పత్రి ఉద్యోగులు ఉత్కంఠగా చూస్తున్నారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement