జాడ లేని హర్యానా గేదెలు | Sakshi
Sakshi News home page

జాడ లేని హర్యానా గేదెలు

Published Mon, Jan 27 2014 1:13 AM

Haryana does not have to track down Buffaloes

పెరవలి, న్యూస్‌లైన్ : ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటంలో ఉన్న ఉత్సాహం ఆచరణలో ఉండడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. అధిక పాలనిచ్చే హర్యానా గేదెలను సబ్సిడీపై అందిస్తామని చెప్పి సొమ్ములు కట్టించుకుని రెండు నెలలు గడుస్తున్నా వాటిని తీసుకురాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రెండు నెలల క్రితం ఈ పథకం గురించి వ్యవసాయ అధికారులు, సిబ్బంది ఊదరగొట్టడంతో సుమారు 170 మంది రైతులు ఒక్కో గేదెకు రూ. 20 వేల చొప్పున డీడీలు తీసి పశుసంవర్థక శాఖ అధికారులకు అందించారు. 15 రోజుల్లో గేదెలు వస్తాయని చెప్పిన అధికారులు రెండు నెలలు గడిచినా వాటి గురించి పట్టించుకోకపోవడంతో రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 సొమ్ములు వసూలు చేసే వరకు నానా హంగామా చేసిన అధికారులు డీడీలు చేతికొచ్చిన తరువాత గేదెల గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. హర్యానా నుంచి గేదెలు తీసుకురావడానికి శీతాకాలమే అనువైన సమయమని, వేసవిలో తీసుకువచ్చేందుకు వాతావరణం అనుకూలం కాదని, అవి తట్టుకోలేవని రైతులకు వివరించి మరీ అధికారులు వారిచే డీడీలు తీయించారు. శీతాకాలం పూర్తవుతున్నా హర్యానా గేదెలు జిల్లాకు చేరకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వారు స్థానిక పశువైద్యాధికారులను నిలదీస్తున్నారు. అధికారులు చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉండని రైతులు జక్కంశెట్టి సుబ్బయ్య, చోడపునీడి బల రాముడు, సి.వెంకటేశ్వరరావు ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రూ.20 వేలు డీడీలు కట్టామని 15 రోజుల్లో గేదెలు వస్తాయని చెబితే నమ్మామని ఇప్పటి వరకు ఆ మాటేలేదని తెలిపారు. అప్పుకు వడ్డీ పెరుగుతోంది తప్ప గేదెలు మాత్రం నేటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

Advertisement
Advertisement