వడ్డీ జలగలు..!

Harassment Of Moneylenders In The Anantapur District - Sakshi

రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీ వసూలు 

సరికొత్త పద్ధతుల్లో వ్యాపారం 

ఉద్యోగుల నుంచి ఏటీఎం కార్డులు, చెక్కుల స్వీకరణతో అప్పులు 

వడ్డీ ఆలస్యమైతే దాడులు చేసి బెదిరింపులు 

చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వినోద్‌కుమార్‌. అనంతపురంలోని రాణినగర్‌లో భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అవసరాల నిమిత్తం శివ అనే వ్యక్తి దగ్గర రూ.1.20లక్షలు అప్పు చేశాడు. ఏడాదిగా తిరిగి చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకూ రూ.లక్ష చెల్లించగా.. ఇంకా రూ.20వేలు మాత్రమే బకాయి ఉంది. కానీ మరో రూ.లక్ష దాకా చెల్లించాలని శుక్రవారం రాత్రి గుత్తిరోడ్డులోని ఓ దాబా ఎదుటనున్న కార్యాలయానికి పిలిపించుకున్న వడ్డీ వ్యాపారస్తుడు తన అనుచరులతో కలిసి రాడ్లతో దాడి చేయించాడు. తీవ్ర గాయాలపాలైన వినోద్‌ ప్రస్తుతం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: వడ్డీ వ్యాపారుల దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అవసరాలను ఆసరాగా చేసుకొని ఇష్టానుసారం వడ్డీ వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజల రక్తం తాగుతున్నారు. అసలును మించి వడ్డీ చెల్లించినా.. ఇంకా మిగిలే ఉందంటూ దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జిల్లా కేంద్రం అనంతపురంలో కోకొల్లలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. గత శుక్రవారం రాత్రి ఆటోడ్రైవర్‌ వినోద్‌కుమార్‌పై చోటు చేసుకున్న దాడితో వడ్డీ వ్యాపారం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో రకరకాల పేర్లతో వడ్డీ వ్యాపారులు లావాదేవీలు సాగిస్తున్నారు. గతంలో ఏడాదికి వడ్డీ, అసలు చొప్పున చెల్లించాలనే నిబంధన ఉండేది. అది కూడా రూ.2ల వడ్డీ అంటే అబ్బో అనుకునేవాళ్లు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. వారం వడ్డీ.. రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. అంటే రూ.లక్ష అప్పుగా తీసుకుంటే వారానికి రూ.10వేలు వడ్డీగా చెల్లించాలి. ఒక వారం చెల్లించకపోతే దానికీ వడ్డీ పడుతుంది. మరో వారం దాటితే ఇంటి మీద పడి గొడవ చేయడంతో పాటు దాడులకు తెగబడుతున్నారు. 

కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు 
నగరంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిలో టీడీపీ నేతలు కూడా అధికంగా ఉన్నారు. కార్పొరేషన్‌లో చక్రం తిప్పిన ఓ నాయకుడు ఎప్పటి నుంచో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అనుచరులు కూడా ఈ దందా సాగిస్తున్నారు. రూ.10 నుంచి రూ.20 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. వీరి వద్ద అప్పు తీసుకున్న వాళ్లు భయంతో వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తూ వీధిన పడుతున్నారు. ప్రస్తుతం ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎక్కువగా వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. పాతూరు, రాణినగర్, వినాయక్‌ నగర్, బుడ్డప్ప నగర్, తదితర ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారమే వృత్తిగా ఎంతో మంది కోట్లకు పడగలెత్తడం గమనార్హం. 

పల్లెలకు విస్తరణ 
కేవలం పట్టణాల్లోనే కాకుండా వడ్డీ వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల పేరుతో కొంతమంది గ్రామాలకు వచ్చి అప్పులిస్తున్నారు. అయితే మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వడ్డీకి అప్పుగా ఇస్తున్నారు. వారం వారం గ్రామాలకు వచ్చి అప్పు వసూలు చేస్తున్నారు. మహిళలు కూలి పనులకు వెళ్లి సంపాదించిన మొత్తాన్ని వారం తిరిగేసరికి మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు మూటకట్టుకుని వెళ్తున్నాయి. గతంలో ఇలాంటి కంపెనీలు కోకొల్లలు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిదెబ్బకు తాళలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడటంతో అప్పట్లో నిషేధం విధించారు. అయితే పలు కంపెనీలు తిరిగి గ్రామాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 

► నగరంలో ఆర్టీఓ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న ఓ రిటైర్డ్‌ ఉద్యోగి వడ్డీ వ్యాపారస్తుని అవతారమెత్తాడు. ఉద్యోగులకు రూ.10 నుంచి రూ.20ల వరకు వడ్డీతో అప్పులు ఇస్తున్నాడు. వారి నుంచి పూచీకత్తుగా ఏటీఎంలు, ఖాళీ చెక్కులను తీసుకోవడం ఈయన ప్రత్యేకత. ఎక్కడైనా తేడా వస్తే కోర్టుకు లాగుతుంటాడు. ఖాళీ చెక్కులు తీసుకోవడంతో రూ.లక్ష బాకీ ఉన్నా రూ.5 లక్షలకు కోర్టులో కేసు వేస్తానంటూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. 
 
► నగరంలోని కమలానగర్‌లో క్యాంటీన్‌ నిర్వహిస్తున్న యువకులకు వినాయక్‌నగర్‌కు చెందిన ఓ వడ్డీ వ్యాపారి రూ.1.50లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆ యువకులు వడ్డీతో కలిపి రూ.3లక్షలకు పైగా చెల్లించారు. తనకు ఇంకా రూ.లక్ష రావాలని, కట్టకపోతే క్యాంటీన్‌ మూసేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై బాధితులు ‘స్పందన’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకు ఫిర్యాదు చేశారు. 

► వడ్డీ వ్యాపారంలో ఇదో సరికొత్త ఆధ్యాయం. రోజు.. వారం.. నెల.. సంవత్సరం.. ఇలాంటి వడ్డీలు అందరికీ తెలిసిందే. కానీ అనంతపురం నగరంలో ముఖ వడ్డీ తెరపైకి వచ్చింది. అంటే అప్పు తీసుకున్న వ్యక్తి ఎక్కడ కనిపిస్తే అక్కడ వడ్డీ చెల్లించాలి. ఒక రోజులో ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లూ వడ్డీ కట్టాల్సిందే. ఓ వ్యక్తి రూ.10వేలు అప్పు తీసుకున్నాడనుకుంటే, రూ.2ల వడ్డీ చొప్పున కనిపించినప్పుడల్లా ఇచ్చుకోవాల్సిందే. ఈ కారణంగా అప్పు తీసుకున్న వ్యక్తి ముఖం చాటేయాల్సి వస్తోంది. 

ఎంతటి వారినైనా ఉపేక్షించం 
పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆటోడ్రైవర్‌ వినోద్‌పై దాడి ఘటనకు సంబంధించి నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశాం. ఇలాంటి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించబోం. బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం.         – పీఎన్‌ బాబు, 
డీఎస్పీ, అనంతపురం    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top