మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష వేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ డిమాండ్ చేశారు.
ఒంగోలు టౌన్ : మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష వేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ డిమాండ్ చేశారు. సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో అత్యాచారయత్నానికి గురై రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలికను గురువారం ఆమె పరామర్శించారు. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఉరిశిక్షలు విధించడం ద్వారా భవిష్యత్‌లో అత్యాచార సంఘటనలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరగడం సభ్యసమాజానికే సిగ్గుచేటన్నారు.
ఒకే మండలంలో రెండు మూడు అత్యాచార ఘటనలు చోటుచేసుకోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికడతామంటూ ప్రభుత్వం ఒకపక్క చెబుతున్నప్పటికీ ఆ దిశగా కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాకలకు చెందిన బాధితురాలిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.