ఆస్తికోసం ఆడ బిడ్డను గెంటేశారు

Handicapped Woman Suffering With Relatives In YSR Kadapa - Sakshi

తల్లిదండ్రులు, అన్న మృతితో అనాథగా మారిన దివ్యాంగురాలు

ఇంటినుంచి వదిన గెంటేయడంతో బంధువుల పంచన కాలం వెళ్లదీస్తున్న వైనం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయం చేయాలంటూ వేడుకోలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట టౌన్‌ : పుట్టుకతోనే వికలాంగురాలిగా పుట్టిన ఆమెకు పుట్టెడు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాజంపేట పట్టణం రామ్‌నగర్‌కు చెందిన పసుపులేటి కృపమ్మ రెండు కాళ్లు లేని దివ్యాంగురాలిగా జన్మించింది. కృపమ్మ తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, పార్వతమ్మ నిరుపేదలు. రెక్కాడితేకాని డొక్కాడని జీవనం వారిది. తమ బిడ్డ దివ్యాంగురాలిగా పుట్టినా అల్లారు ముద్దుగా  పెంచుకుంటూ వచ్చారు. పదేళ్ల క్రితం కృపమ్మ తల్లి పార్వతమ్మ మృతి చెందింది. దీంతో తండ్రి, అన్న వెంకటేష్‌ తల్లిలేని లోటు కనిపించకుండా కృపమ్మను చూసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం తండ్రి కూడా మృతి చెందాడు. ఇదిలా ఉండగా అన్న వెంకటేష్‌కు అతని భార్యతో వచ్చిన విభేదాల వల్ల భార్య, భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. వారి ఒక్కగానొక కుమార్తె కూడా వెంకటేష్‌ వద్దనే ఉండిపోయింది. దీంతో వెంకటేష్‌ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ తన చెల్లెలు కృపమ్మ, కుమార్తెను పోషించేవాడు.

ఈ నేపథ్యంలో వెంకటేష్‌ భార్య దుబాయ్‌ వెళ్లిపోయింది. భార్య విదేశాలకు వెళ్లిపోవడంతో వెంకటేష్‌ మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆరోగ్యం క్షీణించి మూడు నెలల క్రితం మృత్యువాత పడ్డాడు. వెంకటేష్‌ మృతి చెందిన విషయాన్ని అతని భార్యకు తెలిపినా వెంటనే రాకుండా అంత్యక్రియలు నిర్వహించిన నాలుగైదు రోజుల తరువాత వచ్చినట్లు బంధువులు చెబుతున్నారు. అన్న మృతి చెందిన తరువాత రామ్‌నగర్‌లోని అన్న ఇంటిలో ఉన్న తనను వదిన ఇంటి నుంచి గెంటివేసిందని కృపమ్మ విలపిస్తోంది. రెండు కాళ్లులేక జోగాడితే కాని ముందుకు కదలలేని దయనీయ స్థితిలో ఉన్న తనను వదిన ఇంటి నుంచి గెంటివేయడంతో ఇప్పుడు అనాథగా బంధువుల పంచన జీవించాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే దివ్యాంగుల ఫింఛన్‌తో  తన తండ్రి నిర్మించిన ఇంటిలో తలదాచుకొని జీవిస్తామనుకున్నా వదిన ససేమిరా అంటోందని కృపమ్మ వాపోతోంది. కనీసం ఇంటిని విక్రయించి తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని వేడుకుంటున్నా వదిన ఆమె స్నేహితుడితో కలిసి తనపై దౌర్జన్యానికి పాల్పడుతోందని బాధితురాలు పేర్కొంటోంది. తనలాంటి అభాగ్యుల దీనగాధలను పత్రికల్లో  చూసి న్యాయం చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ తనపై దయచూపి న్యాయం చేయాలని ఆ దివ్యాంగురాలు వేడుకుంటోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top