ఆగని హాహాకారాలు ! | Hahakaralu non-stop! | Sakshi
Sakshi News home page

ఆగని హాహాకారాలు !

Jan 20 2015 1:11 AM | Updated on Sep 2 2017 7:55 PM

ఆగని హాహాకారాలు !

ఆగని హాహాకారాలు !

ఆధునిక వైద్యం, శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మాతాశిశు మరణాలను నియంత్రించలేకపోతున్నారు.

సాక్షి, గుంటూరు :  ఆధునిక వైద్యం, శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మాతాశిశు మరణాలను నియంత్రించలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల అవగాహనారాహిత్యం, పౌష్టికాహారలోపం కలగలిపి మాతాశిశువుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి. వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు మాతాశిశు మరణాల రేటు తగ్గించేందుకు అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంతాల దరి చేరడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఆసుపత్రులు ఉన్నా వైద్యులు లేకపోవడం, ఆరోగ్య కార్యకర్తల చిత్తశుద్ధిలోపం తదితర కారణాల వల్ల గర్భిణులు,  పుట్టినబిడ్డలకు సరైన వైద్యరక్షణ లభించడం లేదు.
 
ప్రధానంగా పల్నాడు ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో గర్భిణులకు వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. పుట్టిన బిడ్డ ఆరోగ్యం గా ఎదగడానికి ప్రభుత్వం చేపట్టిన వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం ఆచరణలో సరిగ్గా అమలు కావడం లేదు.
 
మాతాశిశు మరణాల సంఖ్య అధికంగా ఉందని, తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇటీవల విజయవాడలో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
 
రక్తహీనత వల్లే అధిక మరణాలు..
నాలుగేళ్లుగా జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలను పరిశీలిస్తే ఎక్కువమంది మహిళలు రక్తహీనతతో ప్రసవ సమయంలో మృతి చెందుతున్నట్లు ప్రభుత్వ డెత్‌ఆడిట్‌లో నమోదైంది.
 
వాస్తవానికి జిల్లాలో మాతాశిశు మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖకు మాత్రం ఆ సమాచారం అందడం లేదు. మాతాశిశు మరణాల వివరాలను వైద్య,ఆరోగ్యశాఖకు నివేదిస్తే, సవాలక్ష విచారణలను ఎదుర్కొనవలసి వస్తోందని, సంజాయిషీలు చెప్పుకోవాల్సి ఉందనే భయంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది మృతుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
 
వాస్తవానికి ఈ సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు అందినప్పుడే అందుకు అనుగుణ ంగా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. మరణాలకు కారణాల్ని అన్వేషించి భవిష్య త్‌లో అటువంటివి తలెత్తకుండా జాగ్రత్త పడగలరు.
 
క్షేత్రస్థాయిలో ఈ సమాచారం ప్రభుత్వ వైద్యసిబ్బంది చెప్పడం లేదనే కారణంతోనే ఆశ కార్యకర్తలను ఏర్పాటుచేసి సమాచారమిచ్చిన వారికి రూ. 50 చొప్పున పారితోషికం అందిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది.
 
మరణాలు ఇలా...
2005-06లో శిశుమరణాలు 1027, మాతృమరణాలు 49. 2009-10లో శిశుమరణాలు అత్యధికంగా 1,710, మాతృమరణాలు 49. 2010-11లో శిశుమరణాలు 1299, మాతృమరణాలు 61 నమోదయ్యాయి.
 
ఈ రెండేళ్లలో పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 2013-14 సంవత్సరంలో 783 శిశు మరణాలు, 81 మాతృ మరణాలు జరగగా, 2014 డిసెంబర్ నెల వరకు  506 శిశు మరణాలు, 56 మాతృ మరణాలు నమోదయ్యాయి. అనధికారికంగా మృతుల సంఖ్య ఎక్కువే ఉన్నట్టు తెలుస్తోంది.
 
తూతూ మంత్రంగా సమీక్షలు..
మాతా శిశుమరణాల రేటును తగ్గించేందుకు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేకపోవడం గమనార్హం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడమనే సమస్యపై జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దృష్టి సారించడం లేదు.
 
జననీ సురక్షయోజన, అంగన్‌వాడీ పథకం ద్వారా పోషకాహారం అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement