రెండో పెళ్లి చేసుకున్నాడని దాడి | Had attack because of second wedding | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లి చేసుకున్నాడని దాడి

May 27 2015 2:32 AM | Updated on May 25 2018 5:52 PM

రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో భర్తపై మొదటి భార్య దాడి చేయించింది.

దాడిలో పాలుపంచుకున్న మొదటిభార్య, తోడల్లుడు, వదిన
కళ్లలో కారంకొట్టి.. వేటకొడవలితో నరికిన వైనం పరిస్థితి విషమం

 
 తాడిపత్రి రూరల్ : రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో భర్తపై మొదటి భార్య దాడి చేయించింది. ఈ సంఘటన తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇగుడూరుకు చెందిన హరినాథ్(35) మొదటి భార్య రాధను వదిలేశాడు. ఆమె స్వగ్రామం యాడికి మండలం వెంగన్నపల్లి. అయితే.. ఇగుడూరులోనే తన అక్కా బావ దగ్గర ఉంటోంది. హరినాథ్ ఆరు నెలల క్రితం వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లికి చెందిన గౌతమిని రెండో పెళ్లి చేసుకున్నాడు.

మంగళవారం అతను కల్లం నుంచి ఇంటికి బయలుదేరాడు. తోడల్లుడి ఇంటి ముందునుంచి నడుచుకుంటూ వెళుతుండగా మొదటి భార్య రాధ, వదిన నాగేశ్వరమ్మ, తోడల్లుడు గంగరాజు అడ్డుకున్నారు. కళ్లల్లో కారం చల్లారు. గంగరాజు వేటకొడవలితో నరికాడు. దీంతో హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు అక్కడికి రావడంతో వారు ముగ్గురూ పారిపోయారు. గాయపడిన హరినాథ్‌ను వెంటనే తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళ్లారు. తాడిపత్రి డీఎస్పీ చితంబరరెడ్డి, రూరల్ సీఐ అస్రార్‌బాషా తాడిపత్రి ఆస్పత్రిలో హరినాథ్‌తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement