భర్త రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య | married woman ends life in hyderabad | Sakshi
Sakshi News home page

భర్త రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Apr 1 2026 8:46 AM | Updated on Apr 1 2026 12:21 PM

married woman ends life in hyderabad

పచ్చని కాపురాల్లో కలహాలు చిచ్చురేపాయి. మద్యం, మనస్పర్థలు, అక్రమ సంబంధాలు.. ఇలా కారణమేదైనా.. బంధాలు బలి అయ్యాయి. ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.   

మూసాపేట/చెన్నారావుపేట: భర్త రెండో పెళ్లి చేసుకొని వేధిస్తూ ఉండటంతో వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలను చంపి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాలానగర్‌ ఏసీపీ నరేష్‌  స్థానికుల కథనం ప్రకారం... వరంగల్‌ జిల్లా, చెన్నారావు పేట మండలం బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్‌ (31) అదే మండలంలోని పదహార చింతల తండాకు చెందిన స్రవంతి (27) పదమూడేళ్ల కిందట ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 

వీరికి కౌశిక్‌ (10), కార్తీక్‌ (8) సంతానం. వీరు మూసాపేట రాఘవేంద్ర సొసైటీలో ఉంటున్నారు. స్రవంతి దగ్గర బంధువుల అమ్మాయి మహేశ్వరి అలియాస్‌ సోనూ పరిచయం కాగా, ప్రవీణ్‌ ఆమెను సంవత్సరం కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్‌ రెండో భార్య వద్దకు వెళ్లి వచ్చేవాడు. స్రవంతిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో ఆమె పిల్లలను తీసుకుని నాలుగు రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. అయితే ప్రవీణ్‌.. స్రవంతి, పిల్లలు కావాలంటూ సోమవారం సాయంత్రం వారిని తన ఇంటికి తీసుకొచ్చాడు.

 మంగళవారం ఉదయం ప్రవీణ్‌ పనికి వెళ్లడంతో స్రవంతి, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. ప్రవీణ్‌ మధ్యాహ్నం ఇంటికి రాగా తలుపులు మూసిఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా స్రవంతి, ఇద్దరు కుమారులు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. తల్లి ఇద్దరు కుమారులకు ఉరేసిన అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. స్రవంతి, ఇద్దరు పిల్లలను ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. స్రవంతి బంధువులు వరంగల్‌ జిల్లాలోని ప్రవీణ్‌ ఇంటికి నిప్పు పెట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement