ఏ క్షణాన్నయినా ఎన్నికలు.. | GVMC Election Notification | Sakshi
Sakshi News home page

ఏ క్షణాన్నయినా ఎన్నికలు..

Apr 6 2016 11:28 PM | Updated on Sep 3 2017 9:20 PM

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్

సాక్షి, విశాఖపట్నం :  జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. నగర ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను సిద్ధం చేసుకోవాలని.. ఏ క్షణాన ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. ఆ మరుక్షణమే నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి కావాలని ఆయన సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎన్నికల అధికార్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ 12న జాతీయ స్థాయిలో రాష్ర్ట ఎన్నికల అధికార్లతో భారత ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష సమావేశం జరుగనుందన్నారు. 11వ తేదీ నాటికి ఆయా నగరాలు, పట్టణాలకు చెందిన పోలింగ్ కేంద్రాలు, వాటి ప్రాంతాలను అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రతి ఏటా ఇంటింటి సర్వే చేపట్టి ఆధార్ అనుసంధానం చేపట్టాలన్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలోని ఇళ్ల సరిహద్దుల గుర్తింపు ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. ట్యాబ్‌ల ద్వారా జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
 
  సాంకేతిక కారణాల దృష్ట్యా పోలింగ్ కేంద్రం నెంబర్, వార్డు నెంబర్ మార్పు చేయలేక పోతున్నట్టు విశాఖ కలెక్టర్ ఎన్.యువరాజ్ సీఈవో దృష్టికి తీసుకొచ్చారు. సవరణలు చేసుకునే విధంగా సాంకేతిక మార్పులు చేయిస్తామని సీఈవో హామీ ఇచ్చారు. ఎనిమిది నియోజవర్గాల్లో విస్తరించిన విశాఖ మహానగరంలో 4.50 లక్షల గృహాలున్నాయని, 556 ట్యాబ్‌లను ఉపయోగిస్తూ నజరీనక్షా అప్ లోడ్ చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు.
 
 ప్రతి నియోజకవర్గంలో పది పోలింగ్ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ముందు చేపట్టినట్టు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల ఎన్నికల నోడల్ అధికార్లు వారు చేపడుతున్న చర్యలను వివరించారు. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విజయనగరం ఎన్నికల అధికారి ఎస్.డిల్లీశ్వరరావు, డీఆర్వో జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement