జనహితుడి క్షేమం కోరి..

Guntur YSRCP Leaders Pray For YS Jagan Health - Sakshi

జిల్లా వ్యాప్తంగా  సర్వమత ప్రార్థనలు

హత్యాయత్నంపై నేతల ఖండన

వైజాగ్‌ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో గాయపడ్డ వైఎస్సార్‌ సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని జిల్లా వ్యాప్తంగా నేతలు, ప్రజలు సర్వమత ప్రార్థనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 నెలలుగా అలుపెరగని దీక్షతో నిరంతరాయంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న జననేతపై హత్యాయత్నం జరగడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు.     

నరసరావుపేట రూరల్‌: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ శనివారం పట్టణంలో ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్టేషన్‌రోడ్డులోని బాపిస్ట్‌ చర్చిలో ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. వైఎస్‌ జగన్‌ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని  సంఘకాపరి ఏలిషా ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు మల్లెల అశోక్, కందుల ఎజ్రా, బొమ్ము జయరావు, దావల దేవదానం, కుందా చిన్నా, కె.పౌల్, పంగులూరి విజయకుమార్, మన్నవ మేరిబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే గుంటూరు రోడ్డులోని జామియా మసీద్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ నాయకులు ఖాజావలి మాస్టారు, షేక్‌ ఖాదర్‌భాషా, సున్ని, పొదిలి ఖాజ, సయ్యద్‌ ఖాజామొహిద్దీన్‌ పాల్గొన్నారు. 

అప్పిరెడ్డి ఆధ్వర్యంలో
పట్నంబజారు: జనహితం కోరే నిస్వార్ధ రాజకీయనేత జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. పార్టీ 24వ డివిజన్‌ అధ్యక్షుడు అబ్దుల్లా ఆధ్వర్యంలో అరండల్‌పేటలోని స్ఫూర్తి ఫౌండేషన్‌ కార్యాలయంలో ప్రార్థన చేపట్టారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి నీచమైన హత్యా రాజకీయాలకు తెరలేపారన్నారు. ఆపరేషన్‌ గరుడకు చంద్రబాబు దర్శకుడైతే.. శివాజీ తన నటనా కౌశల్యంతో దాన్ని రక్తికట్టించేందుకు కిందా మీదా పడరాని పాట్లు పడుతున్నారని జాలిపడ్డారు. కార్యక్రమంలో షేక్‌ బాజీ, ఇలియాజ్, మొబీన్, మెహబూబ్‌ బాషా పాల్గొన్నారు. 

టౌన్‌ చర్చిలో ప్రార్థనలు
తెనాలి: జగన్‌ మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో బోసురోడ్డులోని టౌన్‌చర్చిలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నాబత్తుని శివకుమార్‌ పాస్టర్లు రెవరెండ్‌ డి.డేవవిడ్‌రాజు, పాస్టరు జె.ఆదాం కెనడీ, ప్టాసర్‌ కె.జయబాబులు, పాస్టర్‌ కె.ఎఫ్‌జి వర్థన్‌కుమార్, నీల సువర్ణబాబులు ప్రార్థనలు చేశారు. పార్టీ పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్‌ దుబాయ్‌బాబు ఆధ్వర్యంలో వహబ్‌చౌక్‌లోని మదీనా మసీదులో శనివారం ప్రార్థనలు నిర్వహించారు. 

జననేత త్వరగా కోలుకోవాలని కోరుతూ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం బోసురోడ్డులోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు.    వేమూరు మండలం పెరవలి గ్రామంలోని  కేశవ మాధవ దేవస్థానంలో ఎంపీటీసీ దాది రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పొన్నూరులో వైఎస్‌ జగన్‌ కోలుకోవాలని మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ నల్లమోతు రూత్‌రాణి, వార్డు కౌన్సిలర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో గ్రామపార్టీ అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలో నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టినా పాల్గొని టీడీపీ నిరంకుశ వైఖరిని ఎండగట్టారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కేశినేని నోరు అదుపులో పెట్టుకో
క్రోసూరు: టీడీపీ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్‌ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటిశివనాగమనోహరనాయుడు హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కావటి మాట్లాడుతూ కేశినానిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌పై దాడి సంఘటనపై రాష్ట్ర ప్రజలందరూ ఎంతో మనోవేదనతో ఉంటే నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావన్నారు. నానికి జగన్‌ దాక అవసరం లేదు, చేతనైతే వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టచ్‌చేసి చూడు నీ సంగతి ఏమవుతుందో తెలుస్తుందని హెచ్చరించారు.

 గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవటం తెలుగుదేశంపార్టీకి చెల్లిందన్నారు. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీకి వెళ్లేందుకు వైఎస్‌జగన్‌హన్‌రెడ్డి కొవ్వుత్తుల నిరసనకు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం విమాశ్రయానికి చేరుకుంటే విమాశ్రయంలోనే అరెస్టుచేసి తిరిగి హైదారాబాద్‌ పంపించినప్పుడు విమాశ్రయం రాష్ట్ర పోలీసుల అధీనంలో ఉందా, ఇప్పుడు అదే విమానాశ్రయం కేంద్ర బలగాల పరిధిలో ఉందా అని నిలదీశారు. సీబీఐతో గాని, మూడో పార్టీ ద్వారా విచారించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు, దుష్ట పాలనలు ఎన్నోరోజులు మనుగడ చేయవని త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top