లెక్క లేదు

Guntur City Corporation Outsourcing Posts Details Nil - Sakshi

నగరపాలక సంస్థలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల్లో లెక్కతేలని వైనం

డెప్యుటేషన్‌ల పేరుతో ఇష్టానుసారంగా విధుల కేటాయింపు

లెక్క తేల్చాలంటూ జీతాలు నిలిపివేసిన కమిషనర్‌

నగర పాలక సంస్థలో ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలకు లెక్క లేదు. వీరు ఎక్కడ పని చేస్తున్నారో ఉన్నతాధికారులు అడిగినా.. సమాధానం చెప్పే దిక్కు లేదు. వీరి జీతాల చెల్లింపుల్లో అవినీతికి అడ్డూఅదుపూ లేదు. బడ్జెట్‌లో ఏటికేడు జీతాల లెక్కలు రెట్టింపైనా ఎవరెవరికి పంచుతున్నారో రికార్డు లేదు. ‘ఏమిటిది ?.. ఏం జరుగుతోంది.. వెంటనే లెక్కలు తేల్చండి’ అంటూ కమిషనర్‌ మండిపడినా 20 రోజులుగా ఆయా విభాగాల అధికారులు ఖాతరు చేసింది లేదు. ఇప్పటి వరకు పని చేసిన సిబ్బందికి ఈ నెల జీతాలు వచ్చిందీ లేదు. ఇదీ గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరు.  

సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల్లో సిబ్బంది కొరత ఉండటంతో అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా కొందరిని నియమించుకునేందుకు  అవకాశం కల్పించారు. వీరికి నగరపాలక సంస్థ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇంజినీరింగ్‌ విభాగంలో 930 మంది, ప్రజారోగ్య విభాగంలో 1667 మంది సిబ్బంది అవుట్‌ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరెక్కడ పని చేస్తున్నారో ఆయా విభాగాల అధికారులకే తెలియని పరిస్థితి.  డిప్యూటేషన్‌ల పేరుతో రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం వంటి అనేక విభాగాల్లో వీరిని కేటాయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు అవినీతి అధికారులు అసలు ఎవరూ పని చేయకుండానే ఉన్నట్లుగా లెక్కలు చూపుతూ నెల నెలా జీతాలు మార్చుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల ఇళ్లలో పనులకూ వీరే..
ప్రజారోగ్య విభాగంలో 1667 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు చెల్లిస్తుండగా, సుమారుగా 300 మంది వరకు నగరపాలక సంస్థతోపాటు, వివిధ శాఖల అధికారుల ఇళ్లల్లో పని చేస్తున్నట్లు సమాచారం. సొంత పనులకు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని వినియోగించుకుంటూ జీతాలు మాత్రం నగరపాలక సంస్థ ద్వారా చెల్లిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఇంజినీరింగ్‌ విభాగంలో 930 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నట్లు చెబుతుండగా, ఇటీవల ఏఈలు తమ వద్ద పని చేసే సిబ్బంది లెక్కలు ఎస్‌ఈకి సమర్పించారు. ఇందులో మాత్రం 888 మంది మాత్రమే పని చేస్తున్నట్లుగా చూపడం చూస్తుంటే మిగతా సిబ్బంది ఎక్కడైనా పని చేస్తున్నారా ? లేక వారు లేకుండానే బినామీ పేర్లతో జీతాల డబ్బులు కాజేస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిలో అనేక మంది అధికారుల ఇళ్లల్లో డ్రైవర్లు, వాచ్‌మెన్‌లు, సెక్యూరిటీ గార్డులుగా వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ప్రతి ఏటా రెట్టింపు బిల్లులు
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల ఖర్చు ప్రతి ఏటా రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల కోసం  2016–17 సంవత్సరానికిగాను రూ. 25 కోట్లు ఖర్చు చేయగా, 2017–18 సంవత్సరానికి అది సుమారుగా రూ. 50 కోట్లకు చేరింది.  

బిల్లులు నిలిపివేసి నివేదిక కోరిన కమిషనర్‌
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మార్చి జీతాల బిల్లులను వివిధ శాఖల అధికారులు కమిషనర్‌ శ్రీకేష్‌ లత్కర్‌కు ఆన్‌లైన్‌ ద్వారా పేర్లు లేకుండా పంపారు. అయితే వీటిపై అనుమానం వ్యక్తం చేసిన కమిషనర్‌ జీతాలు నిలిపివేసి అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఎక్కడెక్కడ పని చేస్తున్నారు ? వారి వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. 

20 రోజులుగా నివేదిక ఇవ్వని అధికారులు
లెక్కలు చూపితే అధికారుల ఇళ్లలో పని చేసే వారితోపాటు అసలు పనిచేయని వారి గుట్టు సైతం బయటపడుతుందని భయమో ఏమోగానీ 20 రోజులు దాటుతున్నా ఇంత వరకు వివరాలు కమిషనర్‌కు అందించలేదు. దీంతో నిజంగా పని చేసిన అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సైతం జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆధార్‌ కార్డును బయోమెట్రిక్‌కు అనుసంధానం చేయాలని గత కమిషనర్‌ అనురాధ అధికారులను ఆదేశించినప్పటికీ ఇంత వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. 

కంప్యూటర్‌ ఆపరేటర్‌ను మంత్రి పేషీకి పంపాం: రామచంద్రారెడ్డి, ఏసీ 
గుంటూరు నగరపాలక సంస్థలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న అవుట్‌ సోర్సిం గ్‌ఉద్యోగిని డిప్యూటేషన్‌పై మంత్రి పేషీకి పంపుతూ ఆర్డర్‌ ఇచ్చాం. మిగతా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు డిప్యూటేషన్‌పై ఇతర విధులు నిర్వర్తిస్తున్నట్లు మా దృష్టిలో లేదు. అకౌంట్‌ సెక్షన్‌లో కొంత ఆలస్యం కావడంతోపాటు, కమిషనర్‌ సెలవులో ఉండటంతో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top