ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణాలు!

Gross Negligence at AP Govt Hospital, patients suffer - Sakshi

సాక్షి, నెల్లూరు: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుస దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలవుతున్నాయి. నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక బాలింత ప్రాణాలు విడిచారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణికి వైద్యం అందలేదు. ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మూడురోజులుగా వైద్యులు అందుబాటులో లేరు. దీంతో గర్భిణీకి వైద్యం అందక.. కడుపులోనే శిశువు మృతిచెందింది. బిడ్డ దక్కకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై భగ్గుమంటున్నారు.

పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ..
ఇక పుత్తూరు పట్టణం ఆచారి వీధికి చెందిన నిఖిలను డెలివరీ కోసం శనివారం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆదివారం రాత్రి ఆమె మరణించింది. ప్రసవానంతరం సరైన చికిత్స చేయకుండా నిఖిల మరణానికి కారణమయ్యారంటూ ఆస్పత్రి సిబ్బందిపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top