నగరం మహా ఆదాయం స్వాహా | Great city income for Swaha | Sakshi
Sakshi News home page

నగరం మహా ఆదాయం స్వాహా

Feb 23 2015 1:20 AM | Updated on Sep 2 2017 9:44 PM

నగరంలో అన్ని వ్యాపారాలు నానాటికీ అభివృద్ధి చెందుతున్నాయి...

కార్పొరేషన్ ఖజానాకు భారీగా గండి
వసూల్ రాజాల హల్‌చల్
పేరుకుపోతున్న పన్ను బకాయిలు

 
రాజమండ్రి :  నగరంలో అన్ని వ్యాపారాలు నానాటికీ అభివృద్ధి చెందుతున్నాయి... రోజురోజుకీ కొత్త వ్యాపారాలు వచ్చి చేరుతున్నాయి. చిన్న ఇళ్లు భవనాలవుతుంటే, భవనాలు ఆకాశ హర్మ్యాలుగా మారుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో ప్రచార మాధ్యమాల హంగామా పెరుగుతోంది. ఎక్కడ చూసినా నగరంలో హోర్డింగులే కనిపిస్తున్నాయి. ఇలా నగరం మహానగరంగా మారుతున్నా, నగర పాలక సంస్థ ఆదాయం మాత్రం ఏ విభాగంలో చూసినా బక్కచిక్కిపోతోంది. కార్పొరేషన్ ఆదాయ వ్యయాల చిట్టా పరిశీలిస్తే గత మూడేళ్లలో నగరపాలకసంస్థ      తిరోగమనంలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. కీలక రంగాల్లో రూ.కోట్లల్లో ఉండాల్సిన పురోగతి రూ. లక్షలకు తగ్గిపోయింది. కొన్నింటిలో ఏకంగా తిరోగమనం కనిపిస్తోంది. ఇందుకు కారకులెవరు? అవకాశం ఉన్నా ఆదాయాన్ని రాబట్టుకోలేని దుస్థితికి దోహదం చేసిందెవరనే ప్రశ్నలు ప్రస్తుతం అందరినీ వేధిస్తున్నాయి.

అవినీతే అసలు విలన్

ఖజానాకు జమచేసే సొమ్ము కట్టక పోయినా ఫర్వాలేదు... మా జేబులు నింపితే చాలు అనే వైఖరి నగరపాలక సంస్థ కీలక విభాగాల్లోని పలువురు ఉద్యోగుల్లో పాతుకుపోయింది. ప్రధానంగా నగర ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో అవినీతి అంతర్భాగమైపోయింది. కాసులిస్తేనే తప్ప పనులు జరగడం లేదని సాక్షాత్తూ అధికార పార్టీ కార్పొరేటర్లే ఆరోపణలకు దిగుతుండడం ఇక్కడి వాస్తవ పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది. నగరంలోని భవనాల స్థితిగతులకు, వాటికి విధిస్తున్న పన్నులకు ఎక్కడా పొంతన కుదరడంలేదు. భవనాలను విస్తరించుకున్న యజమానులు క్షేత్ర స్థాయి సిబ్బందితో సర్దుబాట్లు చేసుకుని పాత పన్నులే కొనసాగిస్తున్నారు. ఇలాంటి కేసులు ఆస్తిపన్ను ఖాతాల్లో సుమారు 20 శాతం మేర ఉంటాయని అంచనా. వీటిని సర్వే చేసి పన్నులను క్రమబద్ధీకరిస్తే ఆస్తిపన్ను పద్దు ఆదాయం 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. అలాగే నగరంలో భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. వాటి ద్వారా రావలసిన ఆదాయం కూడా అధికారిక లెక్కల్లో కనిపించకపోవడం పాలనావైఫల్యానికి అద్దం పడుతోంది.
 
వసూళ్లలోనూ అలసత్వమే !

నగరానికి ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. 2015-16 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూలు లక్ష్యంగా అధికారులు రూ. 24.04 కోట్లు నిర్ణయించారు. 2014-15లో తొలుత రూ. 26.20 కోట్ల వసూలు అంచనా వేయగా సవరించిన అంచనాల ప్రకారం రూ. 22.87 కోట్లకు తగ్గిపోయింది. ఇందులో 40 శాతం కూడా వసూలు కాలేదు. 2013 నుంచి ఇప్పటి వరకూ ఆస్తిపన్ను బకాయిలు రూ. 26 కోట్లకు పైగా పేరుకు పోయాయి. వీటి వసూలులో సంబంధిత శాఖలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. నీటి పన్ను పరిశీలిస్తే 2014-15 అంచనా లక్ష్యం రూ. 3.20 కోట్లు కాగా సెప్టెంబర్ నాటికి రూ.1.08 కోట్లు వసూలైనట్టు లె క్కలు చూపుతున్నారు. నీటి పన్ను బకాయిలు రూ. 4.5 కోట్ల వరకూ పేరుకుపోయాయి. ఇతర విభాగాల వసూళ్లలోనూ ఇదే తీరు కొనసాగుతోంది.

చిక్కిపోతున్న అంచనాలు

తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించిన రాబడి అంశాలు చూస్తే వసూలు కావలసిన బకాయిలను విస్మరిస్తున్నారని అనుమానం కలుగుతుంది. వసూలైన ఆదాయం ప్రకారం బడ్జెట్ అంచనాలు తయారు చేస్తున్నారా, లేక ఆదాయవనరుల ప్రాతిపదికన తయారు చేస్తున్నారా అనే సందేహం కలగక మానదు.
 
రాబడి ఇలా..


అంశం    2013-14లో    2015-16 (రూ. కోట్లలో)  
ఆస్తి పన్ను    23.60     24.04            
ప్రకటన పన్ను    1.52     1.50
వినోదపు పన్ను    2.62    1.50   (రూ.1.12కోట్లు తగ్గింది)
ట్రేడ్ లెసైన్సులు    1.18    1.00
నీటి పన్ను    3.20    3.14
భవనాల లెసైన్స్ ఫీజు    1.66    1.50
 
వీటిలో ఆస్తిపన్ను ఆదాయంలో మూడేళ్లలో రూ. 44 లక్షల పెరుగుదల మాత్రమే చూపించారు. మిగిలిన పన్నుల ఆదాయం మూడేళ్లలో పెరగకపోగా తగ్గినట్టు చూపించారు. ఇంకా వివిధ విభాగాలకు చేసిన కేటాయింపులు కూడా నిర్ణీత నిష్పత్తి ప్రకారం కాకుండా అధికారుల సొంత అంచనాల ప్రకారం కేటాయించారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఇతర సభ్యులు విమర్శించారు. నగరం అన్ని రంగాల్లో పెరుగుతుంటే, ఆదాయం మాత్రం తగ్గడం ఎలా జరుగుతుందనే ప్రశ్న ఈ సందర్భంగా సర్వత్రా వినిపిస్తోంది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement