మిగిలింది 40 రోజులే..

Govt says temporary high court buildings will done by December 15 - Sakshi

     డిసెంబర్‌ 15 నాటికి తాత్కాలిక హైకోర్టు భవనాలను సిద్ధం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 

     సివిల్‌ పనులు కూడా పూర్తికాని వైనం 

     మౌలిక వసతులు, ఇతర పనులకు మరో రెండు నెలలు పడుతుందంటున్న అధికారులు

     తాత్కాలిక సచివాలయంలా హడావుడి చేస్తే నాణ్యత లోపిస్తుందని ఆందోళన

సాక్షి, అమరావతి: హైకోర్టు తాత్కాలిక భవనాలు డిసెంబర్‌ రెండో వారానికల్లా అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. సివిల్‌ పనులు పూర్తి కావడానికే నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఫినిషింగ్, మౌలిక వసతులకు ఎంత లేదన్నా మరో రెండు నెలలు పడుతుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే 3 నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిసెంబర్‌ 15వ తేదీ నాటికే హైకోర్టు తాత్కాలిక భవనాలను సిద్ధం చేస్తామని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టుకు సైతం నివేదించింది. తాత్కాలిక భవనంలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తే న్యాయమూర్తుల నివాసానికి అద్దె భవనాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీంతో డిసెంబర్‌ 15 తర్వాత హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో న్యాయవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

7 నెలలుగా కొనసాగుతున్న పనులు
రాజధాని పరిపాలనా నగరానికి అర కిలోమీటరు దూరంలో నేలపూడి వద్ద హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+2 (జీ+5 ఫౌండేషన్‌) నిర్మించే బాధ్యతను ఈ ఏడాది మార్చిలో రూ.98 కోట్లకు ఎల్‌ అండ్‌ టీ సంస్థకు అప్పగించారు. అయితే ఏడు నెలల క్రితం పనులు ప్రారంభమైనా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంటీరియర్, ప్రధాన భవనాలకు లిఫ్టులు, అదనపు మౌలిక వసతులు, ప్రహరీ గోడ, ప్రవేశ మార్గాలు, అంతర్గత రోడ్లు, పార్కింగ్, మురుగునీటి పారుదల వ్యవస్థ తదితర పనులను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. ఇటీవలే రూ.56 కోట్ల అంచనాతో ఈ పనుల కోసం సీఆర్‌డీఏ టెండర్లు  పిలిచింది. ఈ పనులు కూడా ఎల్‌ అండ్‌ టీకి అప్పగించే అవకాశాలున్నా  లాంఛనాలన్నీ పూర్తై పనులు మొదలయ్యేసరికి ఇంకా సమయం పట్టే పరిస్థితి ఉంది. 

మిగిలిన సివిల్‌ పనులు, టెండర్లు ఖరారు కాని మౌలిక వసతుల పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చెబుతున్న గడువు 40 రోజులు మాత్రమే. అయితే ఈ గడువు లోపు పనులు పూర్తై తాత్కాలిక భవనం అందుబాటులోకి రావడం కష్టమని, కనీసం రెండు నెలలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. 

తాత్కాలిక సచివాలయంలా చేస్తారా?
మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్‌ 15 నాటికి ఈ భవనాన్ని సిద్ధం చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించారు. దీంతో తాత్కాలిక సచివాలయం మాదిరిగా హడావుడిగా చేస్తే ఈ పనులు కూడా నాసిరకంగా జరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయం నీరుగారుతోంది. వానలకు మంత్రుల ఛాంబర్లు తడిసిపోవడం, డ్రెయిన్లు పొంగడం, గోడలు పగుళ్లివ్వడం, ప్రణాళికా లోపంతో గోడలను పగలగొట్టి మళ్లీ కట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో పైకప్పు పెచ్చులూడి వర్షపు నీరు కారడం తెలిసిందే. ఇవన్నీ ప్రభుత్వం హడావుడిగా, నాసిరకంగా పనులు చేయించడం వల్లేనని నిపుణులు గతంలోనే స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top