అడవులను కాపాడడంలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం వెంటనే అధునాతన ఆయుధాలు సమకూర్చాలని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి నాగేంద్రబాబు డిమాండ్ చేశారు.
ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అడవులను కాపాడడంలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం వెంటనే అధునాతన ఆయుధాలు సమకూర్చాలని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో డిప్యూటీ రేంజ్‌ఆఫీసర్ ఎన్.శ్రీధర్, ఏబీవో కరుణాకర్ డేవిడ్ మరణించడం పట్ల తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. గాయపడిన ఎఫ్‌ఎస్‌ఓ రమణ, బీట్ ఆఫీసర్ చంద్రశేఖర్‌రాజు, ప్రొటెక్షన్ వాచర్ నరేందర్‌లకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
గతంలో నిర్మల్‌లో బీట్ ఆఫీసర్ సత్యనారాయణను టేకు స్మగ్లర్లు గొడ్డళ్లతో నరికేశారని, ఏడాదిక్రితం చిత్తూరులో ఏబీవో శ్రీనివాస్‌ను ఎర్రచందనం స్మగ్లర్లు పొట్టనపెట్టుకున్నారని, మూడు నెలలక్రితం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగయ్యను కామారెడ్డిలో అటవీ భూకబ్జాదారులు గొడ్డళ్లతో నరికి చంపారని పేర్కొన్నారు. అటవీ అధికారులపై దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజులు అత్యాధునిక ఆయుధాలు సమకూరుస్తామని గతంలో ప్రకటించినా అమలుకు నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి.. అటవీశాఖ సిబ్బందికి అధునాతన ఆయుధాలు సమకూర్చాలని ఆయన డిమాండ్ చేశారు.