ఎన్నికల ప్రచారంలో..‘గౌతు’కు షాక్‌...!

Gouthu Sirisha Shocked In Election Campaign - Sakshi

సాక్షి, వజ్రపుకొత్తూరు రూరల్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గుణుపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు చేదు అనుభవం ఎదురైంది. మీపై నమ్మకం పెట్టుకుని గత ఎన్నికల్లో ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే మాకు మీరు ఒరగబెట్టింది ఏంటి? అంటూ గ్రామ మహిళలు ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో అర్హులైనవారికి ఇళ్లు ఇచ్చారా? పింఛన్లు ఇచ్చారా? కనీసం తిత్లీ పరిహారం కూడా ఇవ్వలేదు.  తుఫాన్‌లో ఇళ్లుపోయి వీధినపడిన మాకు హుద్‌హుద్‌ ఇళ్లయినా ఇచ్చారా?  అంటూ మహిళలు శిరీషను నిలదీశారు. మీ ప్రభుత్వంలో కేవలం మీ పార్టీ   కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులకే పథకాలు అందించారు. పంచాయతీకి 4 హుద్‌హుద్‌ ఇళ్లు కేటాయిస్తే ఏ అర్హతా లేని మీ కార్యకర్తలే పంచుకున్నారు. తిత్లీ తుఫాన్‌తో సర్వం కోల్పోయిన మమ్మల్ని అదుకోవాల్సిన  మీరు, మీ కార్యకర్తలకే పరిహారం అందించి చేతులు దులుపుకుంటారా?  ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? అని మండిపడ్డారు. 

మీ కార్యకర్తలనే ఓట్లడగండి
తెలుగుదేశం పార్టీ అవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, మిమ్మల్ని గెలిపించేందుకు రాత్రి, పగలు కష్టపడిన మాకు కనీసం గౌరవం కుడా ఇవ్వలేదు. ఇంత కంటే దౌర్భాగ్యం ఇంకేముంది అంటూ గౌతు కుటుంబాన్ని ఎండగట్టారు. మా ఓట్లతో గెలిచి, ప్రభుత్వ పథకాలు అందించలేని మీరు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని గ్రామంలో అడుగుపెట్టి ఓట్లు అడుగుతున్నారు. మీకు సిగ్గు లేదా? అంటూ గ్రామ మహిళలు చీదరించుకున్నారు. వెళ్లండి..వెళ్లి మీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులనే ఓట్లు అడగండి అంటూ పొమ్మన్నారు. దీంతో శిరీష గ్రామ మహిళలతో మాటలతో ఎదరుదాడికి దిగారు. కానీ మహిళలు, గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక  వెనుదిరిగారు. దీంతో తెలుగు తమ్ముళ్లు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయకుండా ప్రచారాన్ని మధ్యలో ఆపి తోకముడిచి గ్రామం దాటారు.  టీడీపీ ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు జి.పాపారావు, కోడ రామన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top