ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవగాహన కార్యక్రమం

Gopalakrishna Dwivedi On VVPAT And EVM - Sakshi

సాక్షి, అమరావతి : రాబోయే ఎన్నికలకు ఈసీ సిద్దమవుతుండగా.. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై సచివాలయంలో ఏపీ ఎన్నికల కమీషన్‌ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించాడు. ఈసారి కొత్తగా వీవీప్యాట్‌లు అందుబాటులోకి వచ్చాయని, ఓటు వేశాక సరిగా పడిందో లేదో వీవీప్యాట్‌ స్లిప్‌లో చూసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఏడు సెకండ్ల పాటు వీవీప్యాట్‌లో స్లిప్‌ కనిపిస్తుందని.. ఒక్కో నియోజకవర్గంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఒక్క వీవీప్యాట్‌ స్లిప్పులను మాత్రమే లెక్కిస్తామన్నారు. ఈసారి బ్యాలెట్‌ యూనిట్‌పై సీరియల్‌ నెంబర్‌, అభ్యర్థి పేరు, ఫోటో, గుర్తులు ఉంటాయని, 15 కంటే ఎక్కువ అభ్యర్థులు ఉంటే.. ఎక్కువ బ్యాలెట్‌ యూనిట్‌లు ఉపయోగిస్తామని తెలిపారు.

రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశ‌మైన ద్వివేది
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ ఎన్నికల కమీషనర్‌ గోపాలకృష్ణ ద్వివేది రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఎమ్‌, సీపీఐ, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ నెల ప్రకటించిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు సీఈవో అందజేశారు. తనకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందిస్తానని ద్వివేది తెలిపారు. సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారం సగానికిపైగా బోగసేనని అన్నారు. ఏపిలో మూడు కోట్ల 93లక్షల 45వేల 717 మంది ఓటర్లు ఉండగా.. కొత్తగా 25లక్షల 20వేల 924 మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా అందిస్తారని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు 2395మంది, 25 పార్లమెంట్‌ స్థానాలకు 344మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారని పేర్కొన్నారు. 15మంది కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే అక్కడ అదనంగా మరో ఈవీఎమ్‌ వాడతామన్నారు. ఏపికి 200మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం పంపిందన్నారు. 75మంది జనరల్‌ అబ్జర్వర్లు కాగా.. 13మంది పోలీస్‌ అబ్జర్వర్లని, మిగిలిన వారంతా వ్యయ పరిశీలకులని పేర్కొన్నారు. ఒక్కొక్క పోలీస్‌ పరిశీలకుడు రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఉంటారని, జనరల్‌ అబ్జర్వర్‌ ఒక పార్లమెంట్‌ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉంటారని.. వారి నెంబర్లు అందరికీ ఇస్తామని, ఏ సమస్య ఉన్నా వెంటనే సంప్రదించవచ్చని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top