సంజీవనికి ప్రాణం

Good Days For 108 Ambulance - Sakshi

108 అంబులెన్స్‌కు మంచి రోజులు

సీఎం ప్రకటనతో కొత్త వాహనాలకు ప్రతిపాదనలు

జిల్లాలోని 46 మండలాలకు 46 అంబులెన్స్‌లు

మరింత మెరుగ్గా అత్యవసర సేవలు

ఫోన్‌ చేసిన 20 నిమిషాలకే చేరుకోనున్న 108 వాహనం

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రికైన 108కు మంచిరోజులొచ్చాయి.. పదేళ్లపాటు పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ సంజీవినికి మళ్లీ ప్రాణమొచ్చింది. ఈ వాహనాలు కుయ్‌..కుయ్‌..కుయ్‌ మంటూ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో రయ్‌..రయ్‌..రయ్‌ మంటూ ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి. జీవితానికి, మరణానికి మధ్య ఓ అడ్డుగోడలా నిలుస్తున్న ‘108’కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవం పోశారు. అన్ని జిల్లాల్లో కొత్త వాహనాల కొనుగోలుకు ఆదేశాలిచ్చామని మంగళవారం అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ చేసిన ప్రకటన పేదల బతుకుల్లో ఆశలు రేకిత్తిస్తోంది.

సాక్షి, నెల్లూరు(బారకాసు): మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక అయిన 108 అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందక అనేక మంది మరణిస్తున్న తరుణంలో, సకాలంలో వైద్య సేవలందాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ 108ను ప్రవేశపెట్టారు. దీని వల్ల మరణాల రేటు గణనీయంగా తగ్గిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పాలనలో ఒక వెలుగు వెలిగిన 108 టీడీపీ పాలనలో నిర్వీర్యమయ్యాయి. గడిచిన ఐదేళ్లలో 108 అంబులెన్స్‌ల నిర్వాహణను పట్టించుకున్న దాఖలాలు లేవు. కాలంచెల్లిన వాహనాలతోనే నెట్టుకొచ్చారు. ఫలితంగా ఫోన్‌ చేసిన గంటకు కూడా వాహనం రాని పరిస్థితి.

ఇందుకు కారణం ఆ అంబులెన్స్‌లో డీజల్‌ లేకనో లేక టైర్లు సరిగ్గా లేకపోవడమో తదితర కారణాలతో పార్కింగ్‌లో ఉన్న చోటు నుంచి కదిలే పరిస్థితి లేదు. కండిషన్‌లో ఉన్న వాహనం మరో పార్కింగ్‌ ప్లేస్‌లో ఉంటుంది. ఆ వాహనం వచ్చే సరికి గంటకు పైగా పట్టేది. దీంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తి వాహనం వచ్చే లోపే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు లేకపోలేదు.

సీఎం జగన్‌ మరో అడుగు ముందుకు.. 
తన తండ్రి ఆశయాలను నేరవేర్చడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేస్తున్నారు. 108 సేవలను మరింత మెరుగు పరచనున్నారు. ఇందుకోసం సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 108 వాహనాల సంఖ్యను పెంచడం, పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. ఇందుకోసం ప్రతిపాదనలు పంపాలని ఆయా జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 108 వాహనాలు ఎన్ని ఉన్నాయని, వీటిలో కాలం చెల్లిన వాహనాలు ఎన్ని ఉన్నాయనే విషయాలను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ వరసుందరం సేకరించి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికను పంపనున్నారు.

జిల్లాకు 46 వాహనాలు 
మండలానికి ఒక 108 వాహనం చొప్పున జిల్లాలోని 46 మండలాలకు గాను 46 వాహనాలు కేటాయించనున్నారు. ప్రస్తుతం 108 అంబులెన్స్‌లు జిల్లాలో 33 ఉన్నాయి. 
ఇందులో 12 వాహనాలు కాలం చెల్లినవిగా ఉన్నాయి. అంటే 13 వాహనాలు అదనంగా పెరగడంతోపాటు మరో 12 వాహనాల స్థానంలో కొత్తవి రానున్నాయి. దీంతో జిల్లాకు 25 కొత్త 108 అంబులెన్స్‌లు రానున్నాయి. ఇకపై ఫోన్‌ చేసిన 15 నిమిషాలకే ప్రమాదంలో ఉన్న వ్యక్తి వద్దకు ప్రత్యక్షమై అత్యవసర వైద్య సేవలందించడం జరగనుంది.  

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం 
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 108 వాహనాలకు సంబంధించిన పలు విషయాలను పరిశీలించి తగు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. మండలానికి ఒక వాహనం చొప్పున మొత్తం 46 మండలాలకు 46 వాహనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 33 వాహనాలు ఉన్నాయి. ఇందులో కాలం చెల్లిన వాహనాలు కూడా ఉన్నాయి. అదనంగా 13 వాహనాలతోపాటు కాలంచెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం.
– డాక్టర్‌ వరసుందరం, డీఎంహెచ్‌ఓ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top