రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా నిత్యం సుమారు 40 వేల మందికి అన్నసమారాధన నిర్వహించనున్నట్లు జిల్లా
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా నిత్యం సుమారు 40 వేల మందికి అన్నసమారాధన నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘాధ్యక్షుడు గాదంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వైఎంహెచ్‌ఏ హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్య సంఘం జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నికైందన్నారు. కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. సంఘం గౌరవాధ్యక్షునిగా మాటూరి వీర వెంకట నర్సింహ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా వంకాయల శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా సుగ్గిశెట్టి నూకరాజు, కోశాధికారిగా జల్లిపల్లి వైకుంఠరావు, అదనపు కోశాధికారిగా నుదురుపాటి శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శిగా సుగ్గిశెట్టి వీరవెంకట శేషనాగ హనుమంతరావు, చీఫ్ కో-ఆర్డినేటర్ చక్కా గంగా సత్యనారాయణ ఎన్నికయ్యారని తెలిపారు.
వీరితో పాటు సుమారు 60 మంది కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన జరుగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, శిద్ధా రాఘవరావులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరౌతారన్నారు. కొత్త కార్యవర్గం 2015 నుంచి 2017 వరకూ పదవిలో ఉంటుందన్నారు. తమ పదవీ కాలంలో సంఘ బలోపేతానికి, వివిధ కార్యక్రమాల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపాన్ని ఏసీ సౌకర్యంతో ఆధునికీకరిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.