నీళ్లివ్వండి బాబూ.. | give me a water | Sakshi
Sakshi News home page

నీళ్లివ్వండి బాబూ..

Feb 19 2015 2:16 AM | Updated on Sep 2 2017 9:32 PM

జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో సేద్యం పడకేసింది.

కరువు దరువు
తీవ్ర వర్షాభావంతో అడుగంటిన భూగర్భ జలాలు
గుక్కెడు మంచి నీళ్లకోసం ఇక్కట్లు
పనులు లేక వలసలు
కబేళాలకు తరలుతున్న మూగజీవాలు
మొర ఆలకించాలని ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల వేడుకోలు

 
 జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో సేద్యం పడకేసింది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులు ఒట్టిపోతున్నాయి. జిల్లాలో కొన్నిచోట్ల పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉపాధి పనుల్లేక కూలీలు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. ఎన్నడూ లేని విపత్కర పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ముఖ్యంగా పడమటి మండలాల్లో  పశుగ్రాసం కొరతతో అన్నదాతలు కంట తడి పెడుతూ వాటిని పోషించలేక కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి పరిస్థితులు కళ్లముందే కన్పిస్తున్నా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది.
 
 తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లావాసి అయినప్పటికీ కనీసం ప్రజల గొంతు తడపడంలో కూడా చొరవ చూపలేదనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో వ్యక్తమౌతోంది. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతాంగం కుప్పకూలి పనులు లేక వలస పోతున్నా కనీసం ధైర్యం చెప్పి పనులు కల్పించిన దాఖలాలు కూడా లేవు. జిల్లాలో వేసవికి ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే ముందుకాలంలో మరింత గడ్డు పరిస్థితులు తప్పవని జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గురువారం నీరు-చెట్టు కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి కనీసం తాగునీరు, ఉపాధి పనులు కల్పించాలని వేడుకుంటున్నారు.
 
గుక్కెడు మంచి నీళ్లకోసం..

జిల్లాలో ఇప్పటికే దాదాపు 2000లకు పైగా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు మూడు రోజులకు కూడా నీటి ట్యాంకరు వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో కుటుంబానికి బిందె నీటితోనే గడపాల్సిన గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.  పడమటి మండలాల్లో మంచినీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో 216 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో 1,000 నుంచి 1,200 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాక రైతులు విలవిలలాడుతున్నారు.
 
పనులు లేక..

 
జిల్లాలో వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటడంతో పనులు లేక కుటుంబాలు కుటుంబాలే గ్రామాలను వదలి పనుల కోసం వలసలు వెళుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే చిన్నపిల్లలు, ముసలి వాళ్లే దర్శనమిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఇప్పటికే 2.2 లక్షల మంది వలస వెళ్లినట్లు సమాచారం. ఇందులో కుప్పం నియోజకవర్గం నుంచే 45 వేల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. చెరువుల్లో పూడికతీత పనులను సైతం యంత్రాలతో చేయిస్తుండడంతో ఇంకా ఈ వలసల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 
మూగజీవాల రోదన

జిల్లాలో పశువులకు మేత దొరక్క అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్ గడ్డి 7 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నా దొరకడం లేదు. తాగునీటితో పాటు గడ్డి లేకపోవడంతో పడమటి మండలాల్లో పశువుల ఆకలి బాధను చూడలేక సంతలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వాటిని కబేళాలకు తెగనమ్ముకుంటున్నారు. దీంతో అన్నదాత కుదేలు కావడంతో పాటు పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement