బరువు.. బాధ్యత! | Sakshi
Sakshi News home page

బరువు.. బాధ్యత!

Published Tue, Oct 23 2018 7:56 AM

Girl Talent In Power Lifting Championships Srikakulam - Sakshi

శ్రీకాకుళం, వీరఘట్టం:  కోడి రామ్మూర్తి నాయుడు నుంచి కరణం మల్లీశ్వరి వరకు జిల్లా క్రీడాకారులు బరువును బాధ్యతగానే తీసుకున్నారు. అదే వరుసలో పయనిస్తోంది వీరఘట్టం అమ్మాయి తూముల సంయుక్త. రాజాం జీఎంఆర్‌ఐటీలో ద్వితీయ ఏడాది ట్రిపుల్‌ ఈ చదువుతున్న సంయుక్త పవర్‌లిఫ్టింగ్‌లో జాతీయ స్థాయిలో సిక్కోలు కీర్తి పతాకం ఎగురవేస్తోంది. ఇంటర్మీడియెట్‌ వరకు కనీసం క్రీడల్లో ప్రావీణ్యత లేని సంయుక్త ఇంజినీరింగ్‌లో మాత్రం కళాశాల యాజమాన్యం చొరవతో పవర్‌ లిఫ్టింగ్‌పై దృష్టి సారించింది. ట్రైనర్‌ మహేష్‌ పర్యవేక్షణలో ప్రతి రోజూ 4 గంటల చొప్పున సాధన చేస్తూ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తోంది ఈ వీరఘట్టం వనిత. పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడలో రాణిస్తున్న సంయుక్తకు వీరఘట్టం కళింగ వైశ్యసంఘం సభ్యులు, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కూర్మనా«థ్, బి.సంపత్‌కుమార్, రిటైర్డ్‌ ఎంఈఓ బీవీ సత్యానందం, తహసీల్దార్‌ ఎస్‌.ఆంజనేయులు అభినందనలు తెలిపారు.

ప్రాథమిక విద్య వీరఘట్టంలోనే..
వీరఘట్టంకు చెందిన వ్యాపారి తూముల శ్రీనివాసరావు, తేజశ్రీల కుమార్తె సంయుక్త 1 నుంచి 7వ తరగతి వరకు స్థానిక మహర్షి హైస్కూల్‌లో, 8 నుంచి పదో తరగతి వరకు పాలకొండ నవోదయ విద్యాలయంలో చదివి టెన్త్‌లో 8.5 గ్రేడ్‌ పాయింట్లతో పాసైంది. తర్వాత విశాఖలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో చదివి 940 మార్కులు సాధించింది. ప్రస్తుతం రాజాం జీఎంఆర్‌ ఐటీలో ద్వితీయ సంవత్సరం ట్రిపుల్‌ ఈ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్‌ కోర్సు చేస్తోంది.

అంతర్జాతీయ పతకాలే లక్ష్యం
ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాత పవర్‌ లిఫ్టింగ్‌ పై ఆసక్తి కలిగింది. జీఎంఆర్‌ యాజమాన్యం పూర్తి సహకారాన్ని అందించడంతో ట్రైనర్‌ మహేష్‌ శిక్షణలో రాణిస్తున్నాను. అంతర్జాతీ య వేదికపై సత్తాచాటి బంగారు పతకం సాధించడంమే నా లక్ష్యం. అందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాను.– తూముల సంయుక్త, వీరఘట్టం

పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తూ..
ఈ ఏడాది మే 26, 27 తేదీల్లో విశాఖ బుల్లయ్య కాలేజీలో జరిగిన వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది జూన్‌ 21 నుంచి 25 వరకు జీఎంఆర్‌ కాలేజీలో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఐదో స్థానంలో నిలిచింది.
జూలై 14, 15వ తేదీల్లో విజయవాడలో జరిగిన సబ్‌ జూనియర్‌ అంతర జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలో రెండో స్థానం కైవసం చేసుకుంది.
గత ఏడాది నవంబర్‌లో రాజమహేంద్రవరంలో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించింది.
 తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 26 నుంచి 30 వరకు లక్నోలో జరిగిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో 63 కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించి రికార్డు సృష్టించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement