సీటు దొరికితే ‘పండగ’ | Get the seat 'Festival' | Sakshi
Sakshi News home page

సీటు దొరికితే ‘పండగ’

Jan 12 2014 4:29 AM | Updated on Sep 2 2017 2:31 AM

సంక్రాంతి సందడి మొదలైంది. క్షణం తీరిక లేని పట్టణవాసులు.. పండగ సంతోషంలో పాల్పంచుకునేందుకు బ్యాగులు సర్దుతున్నారు.

 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: సంక్రాంతి సందడి మొదలైంది. క్షణం తీరిక లేని పట్టణవాసులు.. పండగ సంతోషంలో పాల్పంచుకునేందుకు బ్యాగులు సర్దుతున్నారు. పిల్లలకు సెలవులు రావడంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. స్నేహితులు, బంధువులను తలచుకుంటూ బస్టాండ్ చేరుకుంటున్నారు.
 
 అక్కడ తగినన్ని బస్సులు లేకపోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. పండగ ఆనందం కాస్తా ఆవిరవుతోంది. ఆర్టీసీ యాజమాన్యం రద్దీకి తగిన బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో పిల్లాపాపలతో సీటు దక్కించుకోవడం కష్టసాధ్యమవుతోంది. కర్నూలు రీజియన్ అధికారులు 680 ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టినా కొరత స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం ఒక్క హైదరాబాద్‌కే 70 ప్రత్యేక బస్సులు నడపగా.. విజయవాడకు 4, బెంగళూరుకు 12, నెల్లూరు 3 బస్సులు తిప్పారు. సాధారణ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రిజర్వేషన్ సౌకర్యం ఉండడంతో సర్వీసులన్నీ కిక్కిరుస్తున్నాయి.
 
 శనివారం మధ్యాహ్నం నుంచే కొత్త బస్టాండ్‌లో ఇసుక వేసినా రాలనంత జనం చేరుకున్నారు. నంద్యాల, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కడపతో పాటు తెలంగాణ సెక్టారు వైపు వెళ్లే సర్వీసులన్నీ కిటకిటలాడాయి. కూర్చోవడం దేవుడెరుగు.. కనీసం కాలు పెట్టే స్థలం దొరికినా చాలనుకున్నారు ప్రయాణికులు. విధిలేని పరిస్థితుల్లో చాలా మంది ప్రమాదమని తెలిసినా టాప్ సర్వీసును ఆశ్రయించారు. ఇదిలాఉండగా పండగ రద్దీ దృష్ట్యా హైదరాబద్‌లోని ఎంజీబీఎస్(మహాత్మగాంధీ బస్ స్టేషన్)లో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. కడప జోన్‌లోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు బయలుదేరే బస్సులన్నీ ఎంజీబీఎస్ నుంచి కాకుండా పాత సీబీఎస్ హ్యాంగర్ నుంచి బయలుదేరేలా మార్పు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement