
సాక్షి, తిరుమల: పేలుళ్లకు వాడే నిషేధిత జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు తిరుమలలో కలకలం రేపాయి. తిరుమలలో 24 జిలెటిన్ స్టిక్స్, మరో 38 డిటోనేటర్ల సంచిని స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ సీవీఎస్‌వో ఆకే రవికృష్ణ ఆదివారం మీడియాకు వెల్లడించారు. వీటిని కొండలు, బండలు పేల్చే క్వారీల్లో వాడుతుంటారు. వీటిని తిరుమలలో వాడకూడదని టీటీడీ నిబంధనలు విధించింది.
అయినప్పటికీ పాపవినాశనం మార్గంలో నిర్మాణంలో ఉన్న మూడోదశ తిరువేంకటపథం రింగ్‌రోడ్డు నిర్మాణంలో వీటిని వాడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో టీటీడీ సీవీఎస్‌వో ఆదేశాల మేరకు విజిలెన్స్ వింగ్ విభాగం ఏవీఎస్‌వో శ్రీనాథరెడ్డి, వీఐ లక్ష్మీకాంత్, సిబ్బంది బృందం నిఘా పెట్టింది. ఆదివారం రింగ్‌రోడ్డు ప్రాంతంలోని కొండమీద జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు గుర్తించిన సిబ్బంది స్వాధీనం చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు రవికృష్ణ తెలిపారు.