అదుపులోకి రాని గ్యాస్‌ బ్లో అవుట్‌ 

Gas blow out Rescue operation with Plan-B On 04-02-2020 - Sakshi

ప్లాన్‌–ఏ విఫలం 

నేడు ప్లాన్‌–బితో రెస్క్యూ ఆపరేషన్‌ 

ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా 

సహాయక చర్యల్లో మంత్రులు 

ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద గ్యాస్‌ బ్లో అవుట్‌ను అదుపు చేసేందుకు సోమవారం ఓఎన్‌జీసీ రెస్క్యూ టీమ్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బావిలోని గ్యాస్‌ నిట్టనిలువుగా మూడు కిలోమీటర్ల మేర సిమెంట్‌ కేసింగ్‌ కిందకు తన్నుకుని, అదే ఒత్తిడితో బయటకు ఎగదన్నుతోంది. దీనివల్ల వెల్‌క్యాప్‌ ఎక్కడ ఉందన్న అంచనాకు రాలేకపోతున్నారు. వెల్‌క్యాప్‌ను గుర్తించగలిగితే గ్యాస్‌ ఒత్తిడి అదుపులోకి వచ్చిన మరుక్షణం ఆ వెల్‌క్యాప్‌ను మూసేయడం సులువవుతుందని ఓఎన్‌జీసీ అధికారులు చెబుతున్నారు.

ఇందుకు రెండు పద్ధతులు అనుసరించాలని రెస్క్యూ టీమ్‌ నిర్ణయించుకుంది. ప్లాన్‌–ఏ ప్రకారం నీటిని పంపింగ్‌ చేస్తూ గ్యాస్‌ ఒత్తిడిని తగ్గించి బావిని నియంత్రణలోకి తేవాలనుకుంది. దీనికి అనుగుణంగా ఉదయం నుంచి రాత్రి వరకూ నీటిని పంపింగ్‌ చేశారు. ప్రయోజనం లేకపోవడంతో ప్లాన్‌–బి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రసాయనాలతో కూడిన 40 వేల లీటర్ల మడ్‌ను సిద్ధం చేశారు. మరో 40 వేల లీటర్ల మడ్‌ను అందుబాటులో ఉంచారు. దీనిని పంపింగ్‌ చేసే ప్రక్రియ మంగళవారం చేపడతారు. ఆపరేషన్‌–బి ప్రారంభించిన రెండు గంటల్లోనే గ్యాస్‌ను నియంత్రించవచ్చని ఓఎన్‌జీసీ జీఎం ఆదేశ్‌కుమార్‌ చెప్పారు. రెండురోజు కూడా గ్యాస్‌ అదుపులోకి రాకపోవడంతో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులు ఆందోళన చెందుతున్నారు. 

మనోధైర్యం కల్పించండి : సీఎం వైఎస్‌ జగన్‌
ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌తో రెండు పర్యాయాలు మాట్లాడారు. ఉప్పూడి గ్రామస్తులకు చెయ్యేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని గ్రామస్తులకు మనోధైర్యాన్ని కలిగించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు ఘటనా స్థలంలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top