జేబులు నింపుకుంది చాలు..!

Free Sand Scheme Cancelled In AP - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నదులకు గర్భశోకం ఆపేలా నిర్ణయం వెలువడింది. తీరాల్లో జరుగుతున్న విధ్వంస రచనకు చరమ గీతం పాడేలా ఆదేశాలు వచ్చాయి. ఉచితం ముసుగులో జరిగిన అనుచితమైన పనులు ఆగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్నాళ్లూ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు జేబులు నింపుకోవడానికి వరంగా ఉన్న ‘ఉచిత ఇసుక’ విధానం రద్దయ్యింది. ఖజానాకొచ్చే ఆదాయానికి గండి కొట్టి పార్టీ నాయకుల కడుపులు నిం పడానికి గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఇక చెల్లదు. నదుల వద్ద ఇసుక రీచ్‌ల కేటాయింపులూ ఉండవు. గత సర్కారు చేసిన తప్పిదాలను సరిదిద్ది ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన చర్యలతో నూతన ఇసుక విధానం తీసుకురావడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. జూలై ఒకటో తేదీలోగా దీన్ని అమల్లోకి తీసుకొస్తామని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. అప్పటివరకూ జిల్లాలో ఎక్కడ ఇసుక లారీ కనిపించినా అధికారులదే బాధ్యత. అక్రమ రవాణా బాధ్యులపై పీడీ యాక్ట్‌ కూడా ప్రయోగించనున్నారు.

జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా... ఇలా నది ఏదైనా మాఫియా ఇసుక దోపిడీకి నిలయమైపోయాయి. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అనుసరించిన రకరకాల విధానాల్లో లొసుగులు మాఫియాకు వరంగా మారాయి. ఆ అక్రమార్కులు, టీడీపీ నాయకులు చేతులు కలిపి ఇసుక ద్వారా గత ఐదేళ్లలో దోచుకున్నది సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైమాటేనని ఓ అంచనా. నదుల జిల్లాగా పేర్కొందిన సిక్కోలులో ఎప్పుడూ ఐదు నుంచి పది ర్యాం పులకు మాత్రమే పర్యావరణ అనుమతులతో పాటు కలెక్టరు నేతృత్వంలోని జిల్లా సాండ్‌ కమిటీ నుంచి అనుమతులు ఇచ్చేవారు. కానీ అనధికారికంగా, అక్రమంగా పుట్టగొడుగుల్లా రీచ్‌లు అనేకంగా ఈ ఐదేళ్లూ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ నదుల గర్భాలను పొక్లెయినర్లతో ఛిద్రం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో గందరగోళం..
వాస్తవానికి ఇసుక తవ్వకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వాలు అనుసరించని భిన్నమైన విధానాలను గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జిల్లాలోని 23 ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. ఆన్‌లైన్‌లో చలానా చెల్లించి, రశీదు ర్యాంపులో చూపిస్తే వాహనంలో ఇసుక లోడింగ్‌ చేసేవారు. ఈ విధంగా ర్యాంపు నిర్వహణ సేవలు అందించినందుకు డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతం ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరో 25 శాతం సొమ్ము స్థానిక రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పింది. ఇవేవీ సక్రమంగా అమలుకాలేదు సరికదా మరోవైపు ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయింది. డ్వాక్రా సంఘాల ముసుగులో కొంతమంది అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులే రీచ్‌లను నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. ఇసుక ధర ఆకాశాన్ని అంటడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. చివరకు భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు కూడా దిగిన సంగతి తెలిసిందే.

‘ఉచితం’ ముసుగులో దోపిడీ..
టీడీపీ ప్రభుత్వం ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి 2016, ఏప్రిల్‌ నెలలో ‘ఉచిత ఇసుక విధానం’ తీసుకొచ్చింది. ఎవ్వరికి అవసరమైనా నదికి వెళ్లి ఇసుకను తెచ్చుకోవచ్చని ప్రకటించింది. ఎవ్వరైనా దాన్నో వ్యాపారంగా మా ర్చుకొని అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా టీడీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ ఉచితం ముసుగులో మాఫియా జిల్లాలోని ఇసుక ర్యాంపులను గుప్పిట పట్టింది. ఇందుకు టీడీపీ నాయకులు అన్ని విధాలా మాఫియాకు సహాయ సహకారాలు అందించి పబ్బం గడుపుకొన్నారు. తనిఖీ చేయాల్సిన టాస్క్‌ఫోర్స్‌ ఎక్కడా కనిపించలేదు. ర్యాంపుల్లో సీసీ కెమెరాలు పెడతామంటూ చెప్పినా అవేవీ ఆచరణలోకి రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులను కాసులతో గలగలలాడించేందుకే ఈ ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తెచ్చిందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు పథకంలా మారిపోయింది. నదులనే కాదు థర్డ్‌ ఆర్డర్‌ స్ట్రీమ్‌ కింద వాగులు, వంకలను కూడా వదల్లేదు. జిల్లా శాండ్‌ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదు. కానీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయినర్లు హోరెత్తుతున్నా యి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేస్తున్నారు. వంతెనలకు, ఇరిగేషన్‌ పం పులు, వాటర్‌ ఫిల్టర్‌ సంపులకు కనీసం 500 మీట ర్లు దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోవట్లేదు. నిబంధనల ప్రకారం రీచ్‌ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోపలకు మిషనరీ వాహనాలు (జేసీబీలు, పొక్లెయినర్లు) వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలకు వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోతున్నారు. ముఖ్యంగా ఇసుకరీచ్‌ వద్ద కనీసం ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక మందం ఉండాల్సి ఉంది. అంతకంటే తక్కువ మందం ఉన్న ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషిద్ధం. అయితే ఏ నది లో చూసినా నిలువు లోతున కొన్నిచోట్ల నల్లమట్టి కనిపించేవరకూ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ఇసుక డిమాండును బట్టి రీచ్‌లవద్ద లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ మాఫియా వసూలు చేస్తోంది.

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌
టీడీపీ సర్కారు ‘ఉచిత ఇసుక’ విధానం రద్దు
► నెలాఖరు వరకూ ఇసుక రవాణా నిలిపివేత
నదుల వద్ద రీచ్‌ల కేటాయింపులు బంద్‌
► అక్రమ రవాణా ఆపకపోతే అధికారులపై చర్యలు
► మాఫియా వ్యక్తులపై పీడీ యాక్ట్‌ ప్రయోగం
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

ఖజానా ఆదాయానికి గండికొట్టి..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్‌ వద్ద రూ.100కు మించకుండా సీనరేజీ వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరైజీ రూపేణా జిల్లాలో ఏటా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను ఎక్కువగా స్థానిక సంస్థలకు ఇచ్చి మౌలిక సౌకర్యాల కల్పనకు సద్వినియోగం చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 200 లారీల వరకు ఇసుక విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ మార్కెట్‌లో లారీ ఇసుక ధర డిమాండును బట్టి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలుకుతుండటంతో మాఫియాకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఐదేళ్లలో దోపిడీ చేసింది దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అందువల్లే ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ఏకంగా టీడీపీ నాయకులు తమ అనుచరులు, బంధుగణాన్ని ర్యాంపుల్లో మోహరించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.

నెలాఖరు వరకూ రవాణా బంద్‌..
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను అరికట్టి, ప్రజలకు ఇసుక కష్టాలను తప్పించేలా నూతన విధానం తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తలపోస్తోంది. ఇందు కు సంబంధించిన విధివిధానాలు రూపొందిం చేవరకూ జిల్లాలో ఇసుక రవాణా నిలిపేయనున్నారు. అంతేకాదు నదికి ఆనుకొని ఉన్న పొలాల్లో ఇసుక మేటల తవ్వకాలనూ నిలిపేయాల్సిందే. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకోలేకపోతే అందుకు అధికారులే బాధ్యులవుతారని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

ఆదేశాలు అందాయి..
ఇసుక తవ్వకాలకు సంబంధించిన కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ రవాణాను నిలిపేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఉచిత ఇసుక విధానం రద్దు అయ్యింది. కొత్త విధానం వచ్చేవరకూ రీచ్‌ల కేటాయింపు ఉండదు. ఎవ్వరైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కేసులు పెడతాం.
– ఆర్‌.తమ్మునాయుడు, ఇన్‌చార్జ్‌ ఏడీ, జిల్లా గనుల శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top